మీకు తమిళం రాదా.. తమిళనాడులో జాత్యాహంకార దాడి.. షాకింగ్‌ వీడియో

17 Feb, 2023 16:24 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వచ్చిన వలస కార్మికులపై ఓ తమిళ వ్యక్తి దాడి చేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. 

వివరాల ప్రకారం.. తమిళనాడులో ఓ రైలు ప్రయాణికులతో ఫుల్‌గా నిండిపోయింది. రన్నింగ్‌లో ఉన్న రైలులో ఓ వ్యక్తి తమిళంలో మాట్లాడుతూ కొందరిని పలకరించాడు. వారికి తమిళంలో రాకపోవడంతో వేరే భాషలో సమాధానం ఇచ్చాడు. దీంతో, ఆగ్రహానికి లోనైన సదరు వ్యక్తి.. ట్రైన్‌లో ప్రయణిస్తున్న వలస కార్మికులపై తిట్ల దండకం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా.. వారిపై దాడి చేశాడు. దుర్భాషలాడుతూ చేతితో పంచ్‌లు ఇచ్చాడు. ఓ ప్రయాణికుడి జుట్టు పట్టుకుని లాగుతూ.. తమిళంలో కోపంతో బూతులు తిట్టాడు. 

కాగా, దీనికి సంబంధించిన వీడియోను రైట్ వింగ్ మద్దతుదారు కార్తీక్ గోపీనాథ్ ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేశాడు. దీంతో, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో రైల్వే అధికారులకు చేరడంతో దీన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 323, 294(బీ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇక, ఈ వీడియోపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి దాడులు కరెక్ట్‌ కాదని అంటున్నారు. నార్త్‌లో కూడా దక్షిణాదికి చెందిన కార్మికులు ఉన్నారని కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా కేంద్రం వర్సెస్‌ తమిళనాడు అన్న తీరుగా రాజకీయంగా నడుస్తోంది. బలవంతంగా హిందీ అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తమిళనాడు సీఎం స్టాలిన్‌ హిందీ అమలు విషయంలో రాష్ట్రాలు అమలు చేస్తున్నా రెండు భాషల విధానానికి కేంద్రంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. అంతకుముందు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా.. తమిళనాడు పర్యటన సందర్భంగా నల్లబెలూన్లతో తమిళులు నిరసనలు కూడా వ్యక్తం చేశారు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని వార్తలు