ముగ్గురు బీజేపీ నేతల కాల్చివేత

30 Oct, 2020 08:15 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లాలో ముగ్గురు బీజేపీ నేతలను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనకు లష్కరే తోయిబా అనుబంధ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌(టీఆర్‌ఎఫ్‌) బాధ్యతగా ప్రకటించుకుంది. కుల్గాం జిల్లా బీజేవైఎమ్‌ జిల్లా కార్యదర్శి ఫిదా హుస్సేన్, కమిటీ సభ్యులు ఉమర్‌ హజం, ఉమర్‌ రషీద్‌ బేగ్‌ అనే వారిని గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్చి చంపారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జూన్‌ నుంచి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 8 మంది బీజేపీ కార్యకర్తలు బలయ్యారు. తాజా ఘటనపై కుల్గాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తల హత్య నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు ఉగ్రవాదుల తీరుపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి తగిన బుద్ది చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రధాని విచారం..
కుల్గాం జిల్లాలో ముగ్గురు బీజేపీ కార్యకర్తల కాల్చివేతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో బీజేపీ ఎదుగుదలకు ఎంతోగానే శ్రమిస్తున్న యువ కార్యకర్తలను దారుణంగా హతమార్చడాన్ని ఖండించారు. బాధితులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్‌ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు విచారం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు