వంటింట్లో పాలు పొంగిపోతున్నాయా?.. ఈ చిట్కా బాగుందే

12 Nov, 2021 10:57 IST|Sakshi

How To Stop Milk Boiling Over: సాధారణంగా కొత్త ఇల్లు కొన్నవారు గృహప్రవేశ సమయంలో గిన్నెలో పాలు వేసి వాటిని వేడిచేస్తూ పొంగించంటం చేస్తుంటారు. అయితే అది సంప్రదాయంలో భాగంగా చేస్తుంటారు. కానీ సాధారణ​ సమయంలో స్టవ్‌ మీద వేడి చేస్తున్నప్పుడు గిన్నెలోని పాలు పొంగిపోవటం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. అయితే గృహిణీలు చాలా మంది స్టవ్‌ మీద పాలు పెట్టామన్న విషయాన్నే మర్చిపోయి ఇరుగుపొరుగువారితో కబుర్లలో మునిగిపోతారు. కొంత మంది టీవీకే అతుక్కుపోతారు. దీంతో పాలు కిందిపోయి గృహిణీలకు సమస్య మారుతుంది. అయితే తాజాగా పాలు పొంగటాన్ని నియంత్రించే ఓ వంటింటి చిట్కా​కు సంబంధించి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రచయిత, డాక్టర్‌ నందితా అయ్యార్‌ తాజాగా ఈ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. వీడియోలో పాత్రలోని పాలు పొంగిపోకుండా ఓ చెక్క గరిట నియంత్రిస్తుంది. ‘చెక్క గరిట పాల గిన్నెపై ఉండటం వల్ల పాలు పొంగి కిందపోకుండా ఉంటాయన్న విషయం మీకు తెలుసా?’ అని కామెంట్‌ చేశారు. పాలు మరిగించినప్పుడు వెలువడే ఆవిరి చెక్క గరిటకు తగలటంతో పాలు మరిగే ఒత్తిడి తగ్గుతుందని ఆమె తెలిపారు. దీంతో పాలు గిన్నె నుంచి పొంగిపోయి కిందకు పడకుండా ఉంటాయనిపేర్కొన్నారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ఇంతవరకు ఈ చిట్కా తమకు తెలియదని.. నమ్మలేకపోతున్నాము’ అని ఆశ్చర్యంగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ చిట్కా బాగుంది.. అదేవిధంగా ప్రెజర్‌ కుక్కర్‌ విజిల్స్‌ను లెక్కించడానికి కూడా ఎవరైనా ఓ చిట్కా కనిపెట్టాలి’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘ఈ చిట్కా కొన్నేళ్ల క్రితమే తెలిసి ఉండాల్సింది.. పాలు పొంగిపోయిన ప్రతిసారి మా అమ్మ నాపై గట్టిగా అరిచేది’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. మరి మనం కూడా ఒకసారి ట్రై చేసి ఇది పని చేస్తుందో లేదో చూద్దామా?

మరిన్ని వార్తలు