దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్‌ కన్నుమూత

19 Jun, 2021 00:52 IST|Sakshi

చండీగఢ్‌: దిగ్గజ పరుగుల వీరుడు, ఫ్లయింగ్‌ సిఖ్‌గా ఖ్యాతిగాంచిన భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్‌ (91) కన్నుమూశారు. కరోనా అనంతర సమస్యలతో శుక్రవారం అర్ధరాత్రి చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌)లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 11.30 సమయంలో తుదిశ్వాస విడిచారు. ఇంటి వంట మనుషుల్లో ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆ వ్యక్తి ద్వారా మే 20వ తేదీన మిల్కాసింగ్‌కు వైరస్‌ సోకింది. మే 24న మొహాలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. నెగెటివ్‌ రావడంతో మే 30న డిశ్చార్జి అయినప్పటికీ ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో జూన్‌ 3న ఆయన్ను చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

1932 నవంబర్‌ 20న పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న గోవింద్‌పురలో జన్మించారు. సిక్‌రాథోడ్‌ రాజపుత్రుల కుటుంబంలో జన్మించిన మిల్కాసింగ్‌ 1951లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ నిర్వహించిన పరుగులపోటీలో మిల్కాసింగ్‌కు ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం అథ్లెట్‌గా మారారు. మిల్కాసింగ్‌కు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. సికింద్రాబాద్‌లో మిల్కాసింగ్‌ 9 ఏళ్లపాటు శిక్షణ పొందారు. అనంతరం 1958 కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి సత్తా చాటాడు. అనంతరం1958 టోక్యో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గారు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. త్రుటిలో ఒలింపిక్‌ పతకాన్ని కోల్పోయారు. ట్రాక్‌పై ఆయన చూపిన తెగువతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 1959లో పద్మశ్రీతో సత్కరించింది. మిల్కాసింగ్‌ భార్య నిర్మల్‌ కౌర్‌ కరోనా వైరస్‌తో పోరాడుతూ జూన్‌ 14వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. భార్య మృతి చెందిన నాలుగు రోజులకే ఆయన కన్నుమూయడంతో మిల్కాసింగ్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మిల్కాసింగ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ అనే బాలీవుడ్‌ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో క్రీడాలోకం మూగబోయింది. మరణవార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్ర్భాంతికి లోనయ్యారు. గొప్పవ్యక్తిని కోల్పోయామని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: కరోనాతో మిల్కా సింగ్‌ భార్య మృతి
చదవండి: కరోనా బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు