MHADA: శుభవార్త, ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు!

1 Sep, 2021 08:39 IST|Sakshi

మాడా ఇళ్ల నిబంధనల మార్పునకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం 

ఇళ్లు కేటాయించిన ఐదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు అనుమతి 

ప్రభుత్వానికి అదనపు ఆదాయం.. తప్పనున్న దళారుల బెడద  

సాక్షి, ముంబై: మహారాష్ట్ర హౌసింగ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (మాడా) ఇళ్లలో ఉంటున్న మిల్లు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యజమానులు తమ మాడా ఇళ్లను ఐదేళ్ల తరువాత అమ్ముకోవడానికి అనుమతినిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదివరకు ఈ ఇళ్లను పదేళ్ల తరువాత మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండేది. కానీ, మిల్లు కార్మికులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, వారి డిమాండ్లను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలను సడలించడానికి అంగీకరించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మిల్లు కార్మికులు, వారి వారసులు, కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో సుమారు 56 వస్త్ర మిల్లులు ఉండేవి. రెండు దశాబ్దాల కిందటి వరకు మిల్లు కార్మికులతో ముంబై నగరం కళకళలాడేది. అయితే, 2000-2005 సంవత్సరాల మధ్య కాలంలో దశలవారీగా వస్త్ర మిల్లులన్నీ మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆ తరువాత మూతపడిన మిల్లుల స్థానంలో కార్మికులకు ఇళ్లు నిర్మించి, చౌక ధరకే అందజేయాలనే డిమాండ్‌ తెరమీదకు వచ్చింది. ఈ మేరకు అనేక ఆందోళనలు జరిగాయి. మిల్లు కార్మికుల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాయి. కార్మికుల డిమాండ్లకు ఇతర రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకడంతో అప్పటి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం దిగివచ్చింది. మిల్లుల స్థానంలో కార్మికులకు ఇళ్లు కట్టి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలన ప్రక్రియ పూర్తిచేసింది. లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేసి చౌక ధరకే వారికి ఇళ్లను అందజేసింది.

అయితే, పదేళ్ల వరకు ఆ ఇళ్లను విక్రయించరాదని, అద్దెకు కూడా ఇవ్వరాదని నిబంధనలు విధించింది. దీంతో కార్మికుల ఆర్థిక ఇబ్బందులు తీవ్రం అయ్యాయి. ఇక్కడ ఎక్కువ ధరకు అద్దెకిచ్చి మరోచోట తక్కువ అద్దెకు ఉందామనుకున్న అనేక పేద కుటుంబాల ఆశలకు ప్రభుత్వ నిబంధనలు అశనిపాతంగా మారాయి. దీంతో కార్మిక సంఘాలు ఈ అంశాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలో ఇళ్లను అద్దెకు ఇచ్చుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కానీ, ఇళ్లు వచ్చిన కార్మికుల్లో కొందరు చనిపోగా, వారి కుటుంబ సభ్యులు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. మరికొందరు పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేసి అప్పుల పాలయ్యారు. ఉన్న ఇంటిని అమ్ముకొనైనా అప్పులు తీరుద్దామని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడదామని అనుకున్న వారి ఆశలకు ప్రభుత్వ నిబంధనలు అడ్డుగా నిలిచాయి. పదేళ్ల వరకు ఆ ఇళ్లను విక్రయించడానికి వీలు లేకపోవడంతో గత్యంతరం లేని అనేక మంది గుట్టుచప్పుడు కాకుండా దళారుల ద్వారా అమ్ముకోవడం మొదలు పెట్టారు.

ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లినప్పటికీ తగిన రుజువులు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయింది. దళారీ వ్యవస్థ వల్ల కార్మికులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. అంతేగాక, రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయనికి కూడా గండి పడుతోంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇళ్లు కేటాయించిన ఐదేళ్ల తరువాత అమ్ముకునేందుకు వీలు కల్పించింది. ఇళ్లను విక్రయించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతినివ్వడంతో దళారుల బెడద తప్పనుంది. అధికారికంగా క్రయ, విక్రయాలు జరగడం వల్ల రిజిస్ట్రేషన్, స్టాంపు ద్వారా ప్రభుత్వ ఖజానాలోకి అదనంగా ఆదాయం కూడా రానుంది.  

     

మరిన్ని వార్తలు