ఇప్పటివరకు 25 వేల పక్షులు.. వావ్‌ వాట్‌ ఏ సీన్‌!

5 Jan, 2022 18:16 IST|Sakshi

తొలిసారిగా బహుదా తీరానికి విదేశీ అతిథి పక్షులు 

చిలికా నుంచి నదీ ప్రాంతానికి విహంగాల వలస 

ఇప్పటివరకు 25 వేల పక్షులు చేరుకున్నట్లు గుర్తింపు

బరంపురం: నగర శివారులోని బహుదా నదీ తీరాన విదేశీ అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. తొలిసారిగా ఇక్కడికి విచ్చేస్తున్న విహంగాలను చూసి నగరవాసులు ఆనందం వ్యక్త చేస్తున్నారు. ఏటా శీతాకాలంలో గంజాం జిల్లా, బరంపురం దగ్గరలోని చిలికా సరస్సులో ఉన్న 24 దీవులకు విదేశాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో వలస పక్షులు వచ్చి, విడిది చేస్తుంటాయి. ఎప్పటిలాగే కాకుండా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 185 జాతులకు చెందిన దాదాపు 10 లక్షల పక్షులు చిలికాకు చేరుకోవడంతో, వాటిలో కొన్నింటి నివాసం ఏర్పాటుకు కాస్త అడ్డంకి ఏర్పడింది.

దీంతో విడిది కోసం సరస్సుకు సమీపంలోని బహుదా నదికి కొన్ని పక్షులు చేరుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తున్న అక్కడి వారు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరింత బాగుంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 25 వేల పక్షులు నదీ తీరానికి చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల నదీ తీరంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అక్కడి అడవిలోకి తరలించేందుకు వెళ్లిన బరంపురం అటవీ శాఖ అధికారుల ద్వారా అతిథి పక్షుల ఆచూకీ వెలుగులోకి రావడం విశేషం.

ప్రస్తుతం నది పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకుని 25 వేల వరకు పక్షులు ఉన్నట్లు గుర్తించినట్లు డీఎఫ్‌ఓ అముల్యకుమార్‌ ప్రధాన్‌ తెలిపారు. 
 

చదవండి: కొన్ని రోజులు కాపురం చేసి ముఖం చాటేశాడు.. 44 రోజుల పాటు పగలు, రాత్రి.. చివరికి

మరిన్ని వార్తలు