Women’s Reservation Bill: ఇది యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు: ఎంపీ అసుదుద్దీన్‌

20 Sep, 2023 16:18 IST|Sakshi

న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు ఎంఐఎం నేత, ఎంపీ అసుదుద్దీన్‌ పేర్కొన్నారు. ఆ బిల్లులో కొన్ని ప్రధాన లోపాలున్నాయని అన్నారు. ‘నారీ శక్తి వందన్‌ అధినియం’ పేరుతో ప్రవేశపెట్టిన బిల్లులో ముస్లిం, ఓబీసీ వర్గాల మహిళల కోటాను చేర్చలేదని విమర్శించారు. 

కాగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించే బిల్లును మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై దిగువసభలో బుధవారం చర్చ సాగింది.ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ లోక్‌సభలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ బిల్లు యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు అని విమర్శించారు.

 బీసీలకు న్యాయమైన వాటాను ఈ బిల్లు నిరాకరించిందన్నారు. కేవలం ధనవంతులే చట్టసభల్లో ఉండేలా ఈ బిల్లు పెట్టారని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లులో బీసీ, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అప్పట్లో జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్ వల్లభభాయి పటేల్ రాజ్యాంగ సభలో ముస్లింలపై వివక్ష చూపించారని, వారు నిజాయితీగా ఉంటే ముస్లింలకు మరింత ప్రాతినిధ్యం ఉండేదని ఆరోపించారు.
చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లును 15 ఏళ్లకే పరిమితం చేయొద్దు: ఎంపీ సత్యవతి

మరిన్ని వార్తలు