నెత్తురోడిన జమ్ముకశ్మీర్‌.. ఘోర ప్రమాదంలో 11 మంది దుర్మరణం

14 Sep, 2022 11:12 IST|Sakshi

శ్రీనగర్‌: ఘోర రోడ్డు ప్రమాదంతో జమ్ము కశ్మీర్‌ నెత్తురోడింది. బుధవారం ఉదయం పూంచ్‌ దగ్గర సావ్జియన్ ప్రాంతంలో ఓ మినీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం అక్కడ భీతావాహ వాతావరణం నెలకొంది.

ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలుకాగా.. పాతిక మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వాళ్లను మండీ ప్రభుత్వాసుప్రతికి తరలించినట్లు మండీ తహసీల్దార్‌ షెహ్‌జాద్‌ లతిఫ్‌ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

బుధవారం ఉదయం మండీ నుంచి సౌజియాన్‌కు వెళ్లాల్సిన మినీబస్సు మార్గం మధ్యలో లోయలోకి దూసుకెళ్లి ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులతో పాటు ఆర్మీ రంగంలో దిగి సహాయక చర్యలు ప్రారంభించింది.

ఘటన గురించి తెలియగానే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మరోవైపు కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు