‘అసలు నా శాఖలో ముఖ్యమంత్రికి ఏం పని సర్?‌’

31 Mar, 2021 19:54 IST|Sakshi

బెంగళూరు‌: ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై ఓ మంత్రి గవర్నర్‌కు ఫిర్యాదు చేశాడు. తన మంత్రిత్వ శాఖలో ముఖ్యమంత్రి తల దూరుస్తున్నాడంటూ ఆ మంత్రి ఫిర్యాదు చేయడం కర్నాటకలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఒక మంత్రి ఏకంగా ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయడం వింతగా ఉంది. ముఖ్యమంత్రికి అన్ని శాఖలపై సమీక్ష చేయడం.. పనులు ఆదేశించడం.. ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉంటుంది. కానీ దానికి భిన్నంగా మంత్రి తీరు ఉండడం విస్మయం కలిగిస్తోంది. దీంతో కర్నాటక సీఎం యడియూరప్ప తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కర్నాటక గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ శాఖ మంత్రిగా ఈఎస్‌ ఈశ్వరప్ప ఉన్నారు. ముఖ్యమంత్రి తీరు 1977 వ్యాపార లావాదేవీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ నిబంధనలను ముఖ్యమంత్రి ఉల్లంఘిస్తున్నాడని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫిర్యాదు పత్రం పంచుకున్నాడు. తన మంత్రిత్వ శాఖలో తనకు తెలియకుండా వివిధ పనుల కోసం రూ.774 కోట్ల కేటాయింపులు జరిగాయని మంత్రి ఈశ్వరప్ప ప్రస్తావించారు.

‘ముఖ్యమంత్రికి ఇది తగదు. ఇకపై ఇదే పరంపర కొనసాగితే నేను మంత్రి పదవిలో ఉండలేను’ అని లేఖలో స్పష్టం చేశారు. ఆ ఫిర్యాదును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా పంపించారు. యడియూరప్ప ముఖ్య అనుచరుడుగా ఉన్న ఈశ్వరప్పే ఈ ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యమంత్రిపై గవర్నర్‌కు మంత్రి ఫిర్యాదు చేసిన ఘనత ఆయనకే దక్కి ఉండి ఉంటుంది.

మరిన్ని వార్తలు