విమాన ప్రయాణికులు మాతో సహకరించాలి: సింధియా

15 Jan, 2024 15:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీని తీవ్రమైన పొగ మంచు కప్పేయటంతో ఆదివారం  సుమారు వంద విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. కొన్ని విమానాలు గంటల కొద్ది ఆలస్యంగా బయలుదేరాయి కూడా. ఈ వ్యవహారంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ‘ఎక్స్‌’  ట్విటర్‌ వేదిక స్పందించారు. 

‘‘నిన్న(ఆదివారం) ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా కొన్ని గంటలపాటు విజిబిలిటీ సమస్య ఎదురైంది. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు జీరో విజిబిలిటీ ఉంది. ఈ కారణంగానే ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికుల రక్షణ, భద్రత విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విమాన సర్వీసులను కొన్ని గంటల పాటు నిలిపివేసింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం. ఎయిర్‌పోర్టులోని CAT-IIIలో భాగంగా ప్రారంభించిన నాలుగో రన్‌వేను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తాం.

వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు విమానాల రద్దు, ఆలస్య అసౌర్యాన్ని తగ్గించడానికి, ప్రయాణికుల సరైన సమాచారం అందజేయాలని కూడా విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రయాణికులంతా సహకరించాలని కోరుతున్నా. ప్రయాణికలు అసౌకర్యాన్ని తగ్గించడానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎప్పటికప్పుడు కృషి​ చేస్తోంది. ఈ సమయంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. అలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోకతప్పదు’’ అని మంత్రి సింధియా పేర్కొన్నారు.

మరోవైపు.. విమానం ఆలస్యానికి సంబంధించి ఓ ప్రయాణికుడు  ఇండిగో ఎయిర్‌లైన్స్‌  విమాన కెప్టెన్‌పై దాడికి యత్నంచిన విషయం తెలిసిందే. కెప్టెన్‌ చెంప చెల్లుమనిపించాడు. ఇంతలో ఇతర ప్రయాణికులు అడ్డుతగలడంతో వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

చదవండి: Ram Mandir: అయోధ్యలో భూములు కొన్న అమితాబ్‌.. రేట్లు ఎలా ఉన్నాయి?

>
మరిన్ని వార్తలు