వరుస ప్రమాదాలు.. ఎలక్ట్రిక్ వాహనాల భవితవ్యంపై గడ్కరీ కీలక ప్రకటన

26 Apr, 2022 16:37 IST|Sakshi

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు కాలిపోతుండడం, బ్యాటరీలు పేలిపోతుండడం.. పలువురు మృతి చెందుతుండడం, గాయపడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. దీంతో  మార్కెట్‌లో ఈ-బైకులు కొనేవాళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. భవిష్యత్తు అంతా ఈవీదే అనే నమ్మకంతో అడుగుపెట్టిన కంపెనీలకు ఈ పరిణామాలు మింగుడు పడనివ్వడం లేదు.  ఈ తరుణంలో.. రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన చేశారు

లోపాలున్న వాహనాలను తక్షణమే వెనక్కి తెప్పించుకోవాలని ఎలక్ట్రిక్‌ వాహనాల కంపెనీలను మంగళవారం ఆయన కోరారు. అంతేకాదు.. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో వేడిమి వల్ల ఈవీ బ్యాటరీలకు సమస్య తలెత్తుతుందన్న మాటా మంత్రి నితిన్‌ గడ్కరీ నోట నుంచి వచ్చింది. ‘‘దేశంలో ఈవీ పరిశ్రమ ఇప్పుడే మొదలైంది. కాబట్టి ప్రస్తుత పరిణామాల ఆధారంగా ప్రభుత్వం దీనికి అడ్డుకట్ట వేయాలనుకోవట్లేదు. ఈవీలను వాడుకంలోకి తేవాలన్నదే మా సంపూర్ణ లక్ష్యం. కానీ, వాహన దారుల రక్షణ-భద్రతలను ముఖ్యప్రాధాన్యతలుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, ప్రాణాలతో ముడిపడిన విషయం కాబట్టి రాజీ పడే ప్రసక్తే లేద’’ని స్పష్టం చేశారాయన. 

వాహనాలను మార్కెట్‌లోకి తెచ్చే ముందు కంపెనీలే ముందస్తుగా స్పందించి.. తగిన చర్యలు చేపట్టాలంటూ మంత్రి గడ్కరీ పిలుపు ఇచ్చాడు. వేసవి సీజన్‌ కావడంతోనే ఈవీ బ్యాటరీల ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడిన ఆయన.. ఈ వరుస ప్రమాదాల ఆధారంగా ఈవీ రంగానికి ఎలాంటి అవాంతరాలు కలిగించబోమని హామీ ఇచ్చారు. కంపెనీలు, నిపుణులు ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలంటూ ఆయన కోరారు.

ఇదిలా ఉండగా.. లోపాలున్న వాహనాల ప్రమాదాలపై ఇంతకు ముందే మంత్రి గడ్కరీ స్పందించారు. తక్షణమే అలాంటి ఎలక్ట్రిక్‌ వాహనాలను వెనక్కి రప్పించుకోవాలని, నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే.. జరిమానాలు భారీగా ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు కూడా. మరోవైపు ది సెంటర్‌ ఫర్‌ ఫైర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఈఈఎస్‌) పుణేలో జరిగిన ఒలా బైక్‌ మంటల్లో కాలిపోయిన ప్రమాదంపై విచారణ చేస్తోంది. ఘటనపై దర్యాప్తుతో పాటు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ విభాగం సూచించనుంది.

చదవండి: అగ్నికి ఆహుతైన 20 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. కేంద్రం కన్నెర్ర?

మరిన్ని వార్తలు