తిప్పతీగపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆయుష్‌ మంత్రిత్వశాఖ

17 Feb, 2022 13:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తిప్పతీగ వినియోగిస్తే ఎలాంటి హానికర ప్రభావం ఉండదని ఆయుష్‌ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. తిప్పతీగ కాలేయాన్ని దెబ్బతీస్తుందంటూ కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారం తప్పు అని ఆయుష్‌ శాఖ బుధవారం ఓ ప్రకటనలో ఖండించింది. ఆయుర్వేదంలో ఉత్తమ పునరుజ్జీవన మూలికగా పేర్కొనే తిప్పతీగ సారం ఎలాంటి విష ప్రభావాన్ని కల్గించదని అధ్యయనాలు పేర్కొన్నాయని తెలిపింది. ఔషధం భద్రత ఎంత అనేది వినియోగించే అంశంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.

నిపుణుడైన వైద్యుడి సూచన మేరకు ఔషధం తగిన మోతాదులో వినియోగించుకోవాలని సూచించింది. మూలికా ఔషధ మూలాల్లో నిజమైన నిధిగా భావించే తిప్పతీగ పలు రుగ్మతలను తగ్గిస్తుందని పేర్కొంది. జ్వరాలు, డయేరియా, అల్సర్, క్యాన్సర్, ఆందోళన తదితర రుగ్మతల నివారణకు వినియోగించే తిప్పతీగ కరోనా నియంత్రణకూ వినియోగించినట్లు పేర్కొంది. ఔషధ ఆరోగ్య ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకొంటే తిప్పతీగ విషపూరితమని చెప్పలేమని కేంద్ర మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

చదవండి: (1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న నాగార్జున)

మరిన్ని వార్తలు