రేపు అర్ధ‌రాత్రి వరకు ఇంటర్నెట్ సేవలు బంద్

1 Feb, 2021 14:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు సింగూ, తిక్రీ, ఘాజిపూర్ వంటి ఢిల్లీ సరిహద్దుల్లో ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను రేపు రాత్రి 11 గంటల వరకు నిలివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీ రూల్స్ 2017లోని రూల్ 2లోని సబ్ రూల్ 1 కింద ప్రజా భద్రతను కాపాడటం, ప్రజా అత్యవసర పరిస్థితి దృష్ట్యా టెలికాం సేవలను తాత్కాలికంగా సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.(చదవండి: అమెరికాపై కేసు వేసిన షియోమీ)

కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. కొద్దీ రోజుల క్రితం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఢిల్లీలో ఇంటర్నెట్ సర్వీసులపై సస్పెన్షన్ విధించింది. ఉత్తరప్రదేశ్ నుంచి దేశ రాజధానిలోకి ప్రవేశిస్తున్న నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసు అధికారులు ఢిల్లీ సరిహద్దులో ఖాజీపూర్ సమీపంలో ముళ్ల తీగలతో కంచె వేశారు. ఖాజీపూర్ నిరసన స్థలంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. 

మరిన్ని వార్తలు