గుజరాత్‌లో ట్విస్ట్‌.. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన అభ్యర్థి కిడ్నాప్‌.. ఆ తర్వాత..

16 Nov, 2022 13:55 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థి కనిపించకపోవడం కలకలం సృష్టించింది. ఈ విషయంలో అధికార బీజేపీ సర్కారే తమ అభ్యర్థిని కిడ్నాప్‌ చేశారంటూ ఆప్‌ నేతలు కామెంట్స్‌ చేశారు. ఈ తరుణంలో సడెన్‌ ఆప్‌ నేత ప్రత్యక్షమై తన నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకోవడం చర్చనీయాశంగా మారింది. 

వివరాల ప్రకారం.. గుజ‌రాత్‌లోని సూర‌త్‌కు చెందిన ఆప్‌ అభ్య‌ర్థి కంచ‌న్ జ‌రీవాలా మంగ‌ళ‌వారం నుంచి క‌నిపించ‌డంలేద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. కంచ‌న్ జ‌రీవాలాను బీజేపీ కిడ్నాప్ చేసిన‌ట్లు ఆప్ నేత మ‌నీశ్ సిసోడియా ఆరోపించారు. సూర‌త్ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కంచ‌న్ జ‌రీవాలా ఆప్ త‌ర‌పున పోటీ చేయ‌నున్నారు. నిన్న‌టి నుంచి కంచ‌న్‌తో పాటు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు కనిపించడం లేదన్నారు. నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు ఆఫీసు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కంచ‌న్‌ను బీజేపీ గుండాలు ఎత్తుకెళ్లిన‌ట్లు సిసోడియా ఆరోపించారు.

కాగా, బుధవారం కంచన్‌ జరీవాలాను పోలీసులు పట్టుకుని ఎన్నికల కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా అనూహ్యం జరీవాలా తన నామినేషన్‌ను విత్‌ డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కాగా, ఘటనపై ఆప్‌ నేతలు స్పందించారు. ఇదంతా బీజేపీ కుట్ర.. ఆప్‌ నేత కంచన్‌ జరీవాలాను కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు గురిచేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే, బీజేపీ ఒత్తిడి వల్లే జరీవాల్‌ అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నారని అన్నారు. ఈ తరహా గూండాయిజం భారతదేశంలో ఎప్పుడూ చూడలేదు. అలాంటప్పుడు ఎన్నికల వల్ల ప్రయోజనం ఏముంది? అని కేజ్రీవాల్ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు