‘లాక్‌ డౌన్‌’ దొరికాడు! 2 రోజుల తర్వాత బస్సులో ప్రత్యక్షం

10 Feb, 2022 06:27 IST|Sakshi
చిన్నారి లాక్‌డౌన్‌ 

కొనసాగుతున్న విచారణ

సాక్షి, చెన్నై : అంబత్తూరులో అదృశ్యమైన చిన్నారి ‘లాక్‌డౌన్‌’ బుధవారం  కోయంబేడు బస్టాండ్‌లోని ఓ బస్సులో ప్రత్యక్షం అయ్యాడు. ఈ బిడ్డను కిడ్నాప్‌ చేసి ఇక్కడ పడేసిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు..  చెన్నై అంబత్తూరు గాంధీనగర్‌లో ఓ భవనం నిర్మాణ పనుల్లో ఒడిశాకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు.

వీరిలో కిషోర్, పుత్తిని దంపతులు కూడా ఉన్నారు. వీరికి  ఆకాష్, లాక్‌డౌన్‌(ప్రకాష్‌) అనే చిన్నారులు కూడా ఉన్నారు. ఏడాదిన్నర వయస్సు కల్గిన ప్రకాష్‌ సరిగ్గా లాకౌడౌన్‌ సమయంలో జన్మించాడు. అందుకే ఆ బిడ్డకు లాక్‌డౌన్‌ అని నామకరణం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి తమతో పాటుగా గుడిసెలో నిద్రించిన బిడ్డ అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు అంబత్తూరు పోలీసుల్ని ఆశ్రయించారు.  

ఇన్‌స్పెక్టర్‌ రామస్వామి నేతృత్వంలో బృందం దర్యాప్తులో నిమగ్నమైంది. కాగా బుధవారం కోయంబేడు బస్టాండ్‌లో చెన్నై నుంచి సేలంకు వెళ్లే బస్సులో చిన్నారి లాక్‌డౌన్‌ ప్రత్యక్షం అయ్యాడు.

డ్రైవర్‌ గుర్తించి కోయంబేడు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే అన్ని పత్రికల్లో లాక్‌డౌన్‌ అదృశ్యం వార్త, ఫొటోలు రావడంతో ఆ బిడ్డను పోలీసులు గుర్తించారు. బస్సులో లాక్‌డౌన్‌ దొరికినట్టు అంబత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్ల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.  

మరిన్ని వార్తలు