మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీకి లైసెన్స్‌ పునరుద్ధరణ

9 Jan, 2022 05:06 IST|Sakshi

ఇకపై విదేశీ విరాళాల స్వీకరణకు మార్గం సుగమం

న్యూఢిల్లీ: మదర్‌ థెరిస్సా స్థాపించిన ‘మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ(ఎంఓసీ)’ ఎన్‌జీవోకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విదేశీ విరాళాల స్వీకరణకు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను కేంద్ర హోం శాఖ శుక్రవారం పునరుద్ధరించింది. విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ(ఎఫ్‌సీఆర్‌ఏ యాక్ట్‌) చట్టం కింద సంస్థ లైసెన్స్‌ను పునరుద్ధరించిన నేపథ్యంలో ఇకపై విదేశీ విరాళాలను అందుకునే హక్కులు ఎంఓసీకి దక్కాయి.

కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఎంఓసీ సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల ఖాతాలో నిల్వ ఉన్న నగదు మొత్తాలను వినియోగించుకునే అవకాశం చిక్కింది. నిరుపేదలకు శాశ్వత సేవే ఆశయంగా నోబెల్‌ గ్రహీత మదర్‌ థెరిస్సా 1950లో కోల్‌కతాలో మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ సంస్థను నెలకొల్పారు. ‘నాటి నుంచి దశాబ్దాలుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ఇకమీదటా కొనసాగుతాయి. లైసెన్స్‌ పునరుద్ధరించారనే వార్త మా సంస్థకు నిజంగా పెద్ద ఊరట. లైసెన్స్‌ రాని ఈ రెండు వారాలూ దేశీయ విరాళాలతో మాకు పూర్తి సహాయసహకారాలు అందించిన దాతల దాతృత్వం అమూల్యం’ అని ఎంఓసీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఎంఓసీకి వచ్చిన గత విదేశీ విరాళాలకు సంబంధించి కొంత ప్రతికూల సమాచారం ఉందనే కారణంతో 2021 డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ రోజునే ఆ సంస్థ లైసెన్స్‌ రెన్యువల్‌ దరఖాస్తును కేంద్ర హోం శాఖ తిరస్కరించడం తెల్సిందే. దీంతో దేశవ్యాప్తంగా విపక్షాలతోపాటు భిన్న వర్గాల నుంచి మోదీ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇన్నాళ్లూ ముస్లింలను వేధించిన బీజేపీ సర్కార్‌ తాజాగా క్రిస్టియన్‌ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుందని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో లైసెన్స్‌ను పునరుద్ధరించడం గమనార్హం. భారత్‌లోని ఏదైనా ఎన్‌జీవో.. విదేశీ విరాళాలను పొందాలంటే లైసెన్స్‌ తప్పనిసరి.

తప్పుగా కనబడింది.. 15 రోజుల్లో ఒప్పయిందా?: తృణమూల్‌ ఎంపీ డిరెక్‌
విరాళాల్లో అసంబద్ధ సమాచారం ఉందంటూ దరఖాస్తును తిరస్కరించిన 15 రోజుల్లోనే మళ్లీ లైసెన్స్‌ను కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటని మోదీ సర్కార్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డిరెక్‌ ఓబ్రియన్‌ సూటిగా ప్రశ్నించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్రిస్టియన్ల ఓట్లను రాబట్టేందుకే కేంద్ర ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకుందన్నారు. క్రైస్తవుల ప్రేమకు మోదీ తలొగ్గారన్నారు. ‘పవర్‌ ఆఫ్‌ లవ్‌ గ్రేటర్‌ దన్‌ ది పవర్‌ ఆఫ్‌ 56 ఇంచెస్‌’ అని ట్వీట్‌చేశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మోదీనుద్ధేశిస్తూ 56 అంగుళాల ఛాతి అని గతంలో వ్యాఖ్యానించడం తెల్సిందే.

మరిన్ని వార్తలు