ఆ ఎజెండాతోనే ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది

18 Sep, 2020 21:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అవినీతిని వెలికి తీసే ఎజెండాతోనే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని వైఎస్సార్‌ సీపీ లోక్ సభా పక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. ఏపీలో రెండు వేల కోట్ల రూపాయల నల్లధనం దొరికినట్లు ఇన్‌కమ్‌ టాక్స్ ప్రకటించిందని, ఓ ప్రముఖ వ్యక్తి వద్ద ఈ మొత్తం దొరికినట్లు సీబీడీటీ వెల్లడించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యదర్శి వద్ద ఆ నల్లధనం దొరికిందని,  దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో  చెప్పాలని కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అమరావతి పెద్ద భూ కుంభకోణం అని సాక్షాత్తూ ప్రధానమంత్రి ఎన్నికల సమయంలో చెప్పారు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి దీనిని ఒక అవినీతికి ఏటీఎంగా మార్చారని ప్రధాని అన్నారు. దీని పైన సీబీఐ దర్యాప్తు జరపాలి. రాష్ట్ర బీజేపీ సైతం సీబీఐ దర్యాప్తు కోరుతోంది. ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో రెండు వేల కోట్ల రూపాయలు  అవినీతి జరిగింది. ఇందులో నిష్పక్షపాత సీబీఐ విచారణ జరగాలి. రాజకీయ కక్ష సాధింపు మేము కోరుకోవడం లేదు. న్యాయవ్యవస్థ శాసన వ్యవస్థలోకి చొరబడుతోందని నాడు అరుణ్ జైట్లీ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అదే జరుగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. వెనుకబడిన జిల్లాలకు  నిధులు తక్షణమే విడుదల చేయాలి. ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ బకాయిలు చెల్లించాల’’ని కోరారు.

మరిన్ని వార్తలు