ఆస్పత్రిలో ఫ్లోర్‌ తుడిచిన మంత్రి.. ‘నేనేం ఎక్కువ కాదు’

16 May, 2021 12:45 IST|Sakshi

ఐజ్వాల్‌: కరోనా వైరస్‌ రోజు రోజుకి విజృంభిస్తోంది. పేద, ధనిక తేడాలేకుండా అందరూ ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, మందుల కోసం సోషల్‌ మీడియాలో వినతులు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల వేళల్లో కనిపించే రాజకీయ నాయకులు ఈ కష్టకాలంలో కంటికి కనిపించడం లేదు. కానీ, ఇందుకు భిన్నంగా మిజోరం విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌ లాల్జిర్లియానా అధికార దర్పం పక్కపెట్టి ఆస్పత్రిలో నేలను శుభ్రం చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. మంత్రి ఆర్ లాల్జిర్లియానాను చూసి రాజకీయ నాయకులు కళ్లు తెరవాలని  నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. 

" నేను ఆసుపత్రిలో నేలను శుభ్రంచేసి వైద్యులు, నర్సులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. ఈ పని చేసి నేనొక ఉదాహరణగా నిలవాలి, అది ఇతరులకు అవగాహన కల్పించాలన్నదే నా ఆలోచన. మేము ఆస్పత్రిలో బాగానే ఉన్నాం. వైద్యులు, నర్సులు బాగా చూసుకుంటున్నారు." అని మంత్రి ఆర్‌ లాల్జిర్లియానా మీడియాతో అన్నారు. అంతేకాకుండా తానున్న గది అపరిశుభ్రంగా ఉండటంతో స్వీపర్‌కి ఫోన్ చేయగా, అటువైపు నుంచి స్పందన రాలేదని, దీంతో తానే శుభ్రం చేసినట్లు వివరించారు.

"నాకు ఇలాంటి పనులు కొత్తేం కాదు. అవసరం అనుకున్నప్పుడు నేను ఇలాంటి పనులు చేస్తుంటాను. నేను మంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. ఇతరుల కంటే ఎక్కువని అనుకోవట్లేదు" అని ఆయన చెప్పారు. మంత్రితో పాటు ఆయన భార్య, కుమారుడు కూడా అదే ఆసుపత్రిలో కోవిడ్‌ చికిత్స పొందుతున్నారు. గత సంవత్సరం మిజోరంలోని మంత్రులు వీఐపీ సంస్కృతిని పక్కన పెట్టి ఇంటి పనులు చేయడం, ప్రజా రవాణా, మోటారు బైక్‌లో ప్రయాణించారు. వీరు వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం.. క్రిస్మస్‌ వంటి పండుగ సీజన్‌లో వంట మనుషులుగా పనిచేయడం ద్వారా సామాన్యులుగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి.

(చదవండి: వైరల్‌: బొమ్మతో చిరుతనే ఆటపట్టించిన చిన్నారి!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు