అధిక సంతానోత్పత్తికి మంత్రి పిలుపు.. రీజన్ సరైందేనా?

22 Jun, 2021 07:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓవైపు పెరిగిపోతున్న జనాభా దేశ ఆర్థిక అవసరాలను సంక్లిష్టంగా మారుస్తూ వస్తోంది. ఈ తరుణంలో చాలా రాష్ట్రాలు, జనాభా నియంత్రణ పాలసీలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈశాన్య రాష్ట్రం మిజోరం నుంచి అందుకు విరుద్ధమైన ప్రకటన వెలువడడం చర్చనీయాంశంగా మారింది. ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా ఓ కొత్త ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న కుటుంబాలకు లక్ష రూపాయల ప్రోత్సాహకం ఇస్తానని ప్రకటించారు. దీంతో ఈ  మంత్రి ప్రకటన సంచలనంగా మారింది. 

అస్సాంకి కౌంటర్​?
మిజోరంకి పోరుగున్న ఉన్న అస్సాం.. జనాభా నియంత్రణలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ఉండదని ప్రకటించింది కూడా. ఇక ఈమధ్యే మరో జీవో విడుదల చేసింది. ఇద్దరు సంతానం లోపు ఉన్న కుటుంబాలకు మాత్రమే సంక్షేమ పథకాల లబ్ధి దక్కుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి హిమాంత బిస్వా ప్రకటన చేశారు కూడా.  ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే.. మిజోరం మినిస్టర్​ స్టేట్​మెంట్​ను కౌంటర్​ ఇచ్చాడంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు మంత్రి రాబర్ట్​.
 
కొడుకు సొమ్మే.. 
‘‘మిజోరాం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సరిపోయే స్థాయిలో మిజోరం జనాభాలేదు. మిజోలు లాంటి చిన్న చిన్న తెగల విషయంలో ఇదో పెద్ద సమస్యగా మారింది’’ అని మంత్రి రాబర్ట్ వ్యాఖ్యానించారు. ఫాదర్స్​ డే నాడు సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు. తల్లిదండ్రుల్లో ఎవరోఒకరికి రూ. లక్ష రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తానని ఆయన ప్రకటించారు.  లబ్ధిదారుడికి నగదు ప్రోత్సాహకంతో పాటూ ఓ ట్రోఫిని కూడా పొందుతారు. గరిష్టంగా, కనిష్టంగా ఎంత మంది పిల్లలు అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ స్కీమ్​ను తన సొంత కొడుకు కంపెనీ నుంచే ఇస్తానని ప్రకటించడంతో విమర్శలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తపడ్డాడు ఆయన. 

చదవండి: వీపున మామ.. ఎలా మోయగలిగావ్​ తల్లీ!

మరిన్ని వార్తలు