అక్కడ గెలిస్తే.. అధికారం చేతికొచ్చినట్టే

22 Oct, 2020 07:04 IST|Sakshi

సాక్షి, చెన్నై: గెలుపే లక్ష్యంగా శ్రమించాలని, కొంగుమండలాన్ని గుప్పెట్లోకి తీసుకుంటే, అధికారం చేతికొచ్చినట్టే అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొంగుమండలం పరిధిలో కోవై, తిరుప్పూర్, ఈరోడ్‌ జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ జిల్లాల్లో ఘోర పరాజయం రూపంలో గత ఎన్నికల్లో అధికారాన్ని తృటిలో డీఎంకే కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఈ జిల్లాలపై దృష్టి పెడుతూ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఒక్కో రెవెన్యూ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్ని కలుపుతూ పార్టీ పరంగా ఒక జిల్లాగా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అని విభజించి కార్యదర్శులను నియమించారు. ఈ పరిస్థితుల్లో బుధవారం చెన్నై నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొంగుమండలం నేతలతో స్టాలిన్‌ భేటీ అయ్యారు.

అసెంబ్లీ నియోజకవర్గం వారీగా పరిస్థితిని సమీక్షించారు. గెలుపు లక్ష్యంగా శ్రమించాలని, సమష్టిగా ముందుకుసాగాలని నేతల్ని కోరారు. ఈ జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తే, అధికారం చేతుల్లోకి వచ్చినట్టే అని, ఆ మేరకు నేతలు ఓట్ల కోసం పరుగులు తీయాలని పిలుపునిచ్చారు. పార్టీ పరంగా ఏదేని సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని స్థానిక నేతలకు కొన్ని నంబర్లను స్టాలిన్‌ ఇవ్వడం గమనార్హం. కొంగుమండలం ఈసారి చేజారకూడదని, గెలుపే లక్ష్యంగా శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. 

సీఈసీ కసరత్తులు.. 
అసెంబ్లీ ఎన్నికల కసరత్తులపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రత సాహు దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, మాదిరి ఓటర్ల జాబితా విడుదలకు కసరత్తులు, జిల్లాల్లో ఎన్నికల అధికారుల నియామకం, వారితో భేటీలకు తగ్గట్టుగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోరా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సత్యబ్రత సాహు, ఇతర ఎన్నికల అధికారులతో బుధవారం భేటీ అయ్యారు. సచివాలయం నుంచి సాహుతో పాటు అధికారులు సీఈసీతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఓటర్ల జాబితా కసరత్తులు, నవంబర్‌లో జరగనున్న జిల్లాల ఎన్నికల అధికారులతో సమీక్షలు, అఖిలపక్షం భేటీ అంశాలను సీఈసీ దృష్టికి సాహు తీసుకెళ్లారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు