తమిళనాడు రాష్ట్ర గీతంగా తమిళ్‌ తాయ్‌ వాళ్‌తు

18 Dec, 2021 07:25 IST|Sakshi

అన్ని కార్యక్రమాల్లో గీతాలాపన తప్పనిసరి

ప్రభుత్తం ఉత్వర్వులు

తమిళ తల్లిని కీర్తిస్తూ రాసిన ‘తమిళ్‌ తాయ్‌ వాళ్‌తు’ను రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జరిగే కార్యక్రమాల్లో తప్పని సరిగా ఆలపించాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలపించే సమయంలో అందరూ నిల్చొని, గౌరవాన్ని ప్రదర్శించాలని పేర్కొంది. అయితే దివ్యాంగులు నిలబడాల్సిన అవసరం లేదని తెలిపింది.  

సాక్షి, చెన్నై: మనోన్మనియం సుందరం పిల్లై రచించిన ‘తమిళ్‌ తాయ్‌ వాళ్‌తు’ను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఈ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 55 నిమిషాల నిడివితో కూడిన ఈ గీతాన్ని రికార్డింగ్‌ రూపంలో కాకుండా శిక్షణ పొందిన వారి ద్వారా పాడించాలని సూచించింది. అలాగే ఈ గీతం ఆలపించే సమయంలో అందరూ తప్పనిసరిగా లేచి నిలబడాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే దివ్యాంగులకు మాత్రం మినహాయింపు కల్పించారు. అన్ని విద్యా సంస్థలు, వర్శిటీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రతి రోజూ తప్పనిసరిగా తమిళ తల్లి గీతం ఆలపించే విధంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నేడు ప్రాణ రక్షణ పథకానికి శ్రీకారం
ప్రమాదాల బారిన పడ్డ వారికి తక్షణ వైద్య సేవల నిమిత్తం ప్రాణ రక్షణ పథకానికి ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం చెంగల్పట్టు జిల్లా మేల్‌ మరువత్తూరులో జరిగే కార్యక్రమంలో ఈ పథకానికి సీఎం ఎంకే స్టాలిన్‌ శ్రీకారం చుట్టనున్నారు. అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం ప్రభుత్వం, ప్రైవేటు సహకారంతో ఈ పథకం అమలు చేయనున్నారు. ఇందు కోసం ప్రభుత్వం ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులను ఎంపిక చేశారు.

ఎక్కడైనా ప్రమాదాలు జరిగిన పక్షంలో క్షతగాత్రులను ఎవరైనా సమీపంలోని ఆస్పత్రులకు తరలించవచ్చు. సకాలంలో వైద్య సేవలందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఇదిలా ఉండగా చెన్నైలోని దివంగత మాజీ సీఎం కరుణానిధి హయాంలో 58 ఎకరాల్లో అడయార్‌లో తోల్కాప్పియా పూంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పదేళ్లుగా ఈ పార్కును అన్నాడీఎంకే పాలకులు పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను సీఎం ఎంకే స్టాలిన్‌ శుక్రవారం పరిశీలించారు. పనులు త్వరితగతిన ముగించాలని ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు