MK Stalin: స్టాలిన్‌ వరాల జల్లు.. వారికి గుడ్‌న్యూస్‌

5 May, 2021 12:12 IST|Sakshi

1,212 నర్సుల ఉద్యోగాల క్రమబద్ధీకరణ

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా జర్నలిస్టులు 

సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేలోపే ప్రభుత్వ పాలనలో మునిగిపోయారు. కరోనా పరిస్థితులను తెలుసుకుంటూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంగళవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఇదే డిమాండ్‌పై అనేకసార్లు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. డీఎంకే అధికారంలోకి వస్తే కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న నర్సులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్టాలిన్‌ హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న దశలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలు ఎంతో అవసరంగా మారిన విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రంజన్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ సోమవారం స్టాలిన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్న 1,212 మంది నర్సుల ఉద్యోగాలను పర్మనెంట్‌ చేయనున్నట్లు స్టాలిన్‌ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తామని.. అంకిత భావంతో కరోనా విధులు నిర్వహించాలని స్టాలిన్‌ నర్సులను కోరారు. 

జర్నలిస్టులు ఇక ఫ్రంట్‌లైన్‌ వారియర్లు 
తమిళనాడులో వివిధ మాధ్యమాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పరిగణిస్తామని స్టాలిన్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న విలేకరుల సేవలను కొనియాడారు. జర్నలిస్టుల హక్కులను కాపాడుతూ తగిన రాయితీలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

చదవండి: MK Stalin: 7న స్టాలిన్‌ ప్రమాణం 

మరిన్ని వార్తలు