ఆ బిల్లును అడ్డుకుందాం.. సీఎం జగన్‌కు లేఖ రాసిన స్టాలిన్‌

23 Jun, 2021 04:23 IST|Sakshi

ఓడరేవుల బిల్లును అడ్డుకుందాం

మైనర్‌ పోర్టులపై రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాక్కొంటోంది 

వైఎస్‌ జగన్‌ సహా 8 తీరప్రాంత రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్‌ లేఖ

చెన్నై: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2021 ముసాయిదాను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. మైనర్‌ పోర్టుల విషయంలో రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలని కోరుతూ 8 తీరప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తాజాగా లేఖ రాశారు. చిన్నతరహా ఓడరేవులపై పెత్తనాన్ని మారిటైమ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌కు(ఎంఎస్‌డీసీ) కట్టబెట్టేలా కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్‌ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదా బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించేందుకు ఎంఎస్‌డీసీ ఈ నెల 24న సమావేశాన్ని తలపెట్టిందని పేర్కొన్నారు.

‘‘ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండియన్‌ పోర్ట్స్‌ యాక్ట్‌–1908 ప్రకారం.. మైనర్‌పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణ వంటివి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయి. ఇకపై ఇలాంటి అధికారాలను ఎంఎస్‌డీసీకి బదిలీ చేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటోంది’’ అని స్టాలిన్‌ వెల్లడించారు. రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా ఉన్న ఈ బిల్లుపై అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌తో సహా గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.

ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందితే చిన్నతరహా ఓడరేవుల విషయంలో ఇక రాష్ట్రాలకు ప్రాధాన్యమైన పాత్ర ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.  రాష్ట్రాల అధికారాలను హరించే బిల్లును కలిసికట్టుగా అడ్డుకుందామని తీరప్రాంత రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 24న జరిగే ఎంఎస్‌డీసీ సమావేశంలో మన గళం వినిపిద్దామన్నారు. 

మరిన్ని వార్తలు