ప్రిన్సిపాల్‌ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌

22 Jun, 2022 11:49 IST|Sakshi

ఓ కాలేజీ ప్రిన్స్‌పాల్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాడో ఎమ్మెల్యే. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకు అనుకుంటున్నారా.. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ప్రిన్సిపాల్‌ సరైన సమాధానం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే శ్రీనివాస్ జూన్‌ 20వ తేదీన మాండ్యాలోని నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీలో జరుగుతున్న కంప్యూటర్‌ ల్యాబ్‌కు సంబంధించిన పనుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ క్రమంలో కాలేజీ ప్రిన్స్‌పాల్‌.. ఎమ్మెల్యే అడిగిన ప్రతీ ప్రశ్నకి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. 

దీంతో, సహనం కోల్పోయిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌.. అక్కడున్న వారందరి ముందే ప్రిన్సిపాల్‌ చెంప చెళ్లుమనిపించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాకయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. 

ఇది కూడా చదవండి: సింప్లిసిటీ చాటుకున్న ద్రౌపది ముర్ము.. పలువురి ప్రశంసలు

మరిన్ని వార్తలు