పొత్తు కోసం కమల్‌ సేన చూపు.. డీఎంకే స్టాలిన్‌ వైపు?

18 Nov, 2022 11:14 IST|Sakshi

కూటమిలో చేరాలని నేతల పట్టు 

సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరాటం వద్దని సూచన  

తాను చూసుకుంటానంటూ కమల్‌ ఉద్బోధ  

సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూటమితో కలిసి ముందుకు సాగాలని మక్కల్‌ నీది మయ్యం వర్గాలు భావిస్తున్నాయి. అధికార డీఎంకేతో జత కట్టాలంటూ.. పార్టీ అధినేత కమల్‌కు వివిధ జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలు సూచించారు. వివరాలు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను మక్కల్‌ నీది మయ్యం ఒంటరిగానే ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో 2024 లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవడంతో పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఆపార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం చెన్నైలో జరిగింది. పార్టీ పరంగా ఉన్న  85 జిల్లాల కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ నేతలు, పార్టీ ఉపాధ్యక్షులు మౌర్య, తంగవేలు, కార్యదర్శి సెంథిల్‌ అర్ముగం, శివ ఇలంగో, స్నేహన్, మూకాంబీకై, మురళీ అబ్బాస్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ అధినేత, నటుడు కమల్‌ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.  

కూటమి కోసం పట్టు.. 
లోక్‌సభ ఎన్నికలను ఈ సారి బలమైన కూటమితో కలిసి ఎదుర్కొంద్దామని, గతంలో చేసిన తప్పులు పునావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడికి నేతలు విజ్ఞప్తి చేశారు. డీఎంకేతో జత కట్టే విధంగా, మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయడానికి సంబంధించిన వివరాలను కొందరు నేతలు అందజేసినట్లు సమాచారం. ఎక్కువమంది మంది డీఎంకే కూటమితో ఎన్నికలను ఎదుర్కొంద్దామని, ఇందుకు సంబంధించిన నిర్ణయం ముందే తీసుకోవాలని కమల్‌ను కోరారు. చివర్లో కమల్‌ ప్రసంగిస్తూ, కూటమి గురించి పట్టించుకోవద్దని, ఈ వ్యవహారంపై తాను నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలను ఎదుర్కొనే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. ఎవరితో కలిసి వెళ్లాలి..? అనే విషయాన్ని పక్కన పెట్టి, ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. అలాగే చెన్నైలో మక్కల్‌ నీది మయ్యం కోసం భారీ కల్యాణ వేదికను నిర్మించను న్నట్లు ఈసందర్భంగా కమల్‌ ప్రకటించారు.  

మరిన్ని వార్తలు