నడిరోడ్డుపై ఎమ్మెన్నెస్‌ నేత హత్య

24 Nov, 2020 08:15 IST|Sakshi

  థానేలో ఘటన.. 

థానే: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్‌) పదాధికారి జమీల్‌ షేక్‌ను వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగడు తుపాకీతో కాల్చి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనలో జమీల్‌ షేక్‌ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. థానే రాబోడిలోని బిస్మిల్లా హోటల్‌ ఎదురుగా సోమవారం మధ్యాహ్యం 1.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న జమీల్‌పై దుండగుడు కాల్చిన బుల్లెట్‌ నేరుగా తలలోకి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలపాలైన జమీల్‌ను స్థానికులు జుపిటర్‌ ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే ఆయన మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎమ్మెన్నెస్‌ పదాధికారులు అవినాష్‌ జాదవ్, రవీంద్ర మోరేలతోపాటు పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ అవినాష్‌ అబురే, నేర పరిశోధన శాఖ డిప్యూటీ కమిషనర్‌ లక్ష్మికాంత్‌ పాటిల్, సహాయక కమిషనర్‌ నీతా పాడవి, రాబోడి సీనియర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర శిరతోడే తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. థానేలో జరిగిన ఈ సంఘటనతో పోలీసు యంత్రాంగం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హంతకుని కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాబోడిలో క్లస్టర్‌ యోజనను ఎమ్మెన్నెస్‌ ముఖ్యంగా జమీల్‌ షేక్‌ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతోనే ఈ హత్య జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు