భయాందోళనకు గురైన రంజిత కోలి

28 May, 2021 11:50 IST|Sakshi
దుండగుల దాడిలో ధ్వంసమైన కారు.. స్పృహ తప్పిన ఎంపీ రంజిత

జైపూర్‌: కరోనాతో బాధపడుతున్న వారిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తున్న బీజేపీ లోక్‌సభ సభ్యురాలికి ఘోర పరాభవం ఎదురైంది. ఒక్కసారిగా కారును నిలువరించి రాళ్లు, ఇనుప రాడ్‌లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆమె వాహనం అద్దాలు పగిలిపోగా వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ లోక్‌సభ స్థానం నుంచి రంజిత కోలి గెలిచారు. ఆమె తన నియోజకవర్గంలోని ఆస్పత్రుల సందర్శనకు మంగళవారం బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 11.30 గంటల సమయంలో ధర్సోని గ్రామం మీదుగా భరత్‌పూర్‌ వెళ్తున్నారు. గ్రామం మీదుగా ఒక్కసారిగా ఐదారుగురు వ్యక్తులు రాళ్లు.. ఇనుప రాడ్‌లతో దాడికి తెగబడ్డారు. వీరి దాడితో ఎంపీ రంజిత, ఆమె అనుచరులు భయాందోళన చెందారు. వారి దాడిలో స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారు డిశ్చార్జయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎంపీ రంజిత కోలి ట్విటర్‌లో పోస్టు చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టనని.. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారని  తెలిపారు. అర్ధరాత్రి కావడంతో నిందితులను గుర్తించలేకపోయారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్‌ బీజేపీ అధ్యక్షుడు సతీశ్‌ పూనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఈ దాడి చేసిందని ఆరోపించారు. నేరాలకు రాజస్థాన్‌ అడ్డాగా మారిందని విమర్శించారు.

చదవండి: సీఎం మార్పు: కుట్రలపై ముఖ్యమంత్రి ఘాటు స్పందన
చదవండి: ఒక ప్రభుత్వం కాదు ఇది మూడు గ్రూపుల సర్కారు

మరిన్ని వార్తలు