ప్రభుత్వ పథకాలతో వివక్ష మాయం

13 May, 2022 05:34 IST|Sakshi

ప్రధాని మోదీ

భరుచా: ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అమలైతే సమాజంలో వివక్షల్ని రూపుమాపవచ్చునని, బుజ్జగింపు రాజకీయాలకు కూడా తెరదించవచ్చునని ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాలపై సరైన సమాచారం లేక అవి కాగితాలకే పరిమితమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం వితంతువులు, వృద్ధులు, నిరుపేదలకు ఆర్థిక సాయం అందించడం కోసం రూపొందించిన నాలుగు పథకాలు నూటికి నూరు శాతం భరూచీ జిల్లాలో లబ్ధిదారులందరికీ అందిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

మోదీ భావోద్వేగం
అంతకు ముందు ప్రధాని మోదీ పథకాలు అందుకున్న లబ్ధి దారులతో మాట్లాడారు. వారిలో కంటి చూపు కోల్పోయిన అయూబ్‌ పటేల్‌ తన పెద్ద కుమార్తె అలియాతో కలిసి వచ్చారు. పన్నెండో తరగతి చదువుతున్న ఆమె డాక్టర్‌ చదవాలని అనుకుంటోందని, అందుకోసం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకు డాక్టర్‌ చదవాలని అనుకుంటున్నావు అని ఆ అమ్మాయిని ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం విని ప్రధాని కదిలిపోయారు. చూపు లేని తన తండ్రి దుస్థితిని చూస్తూ తట్టుకోలేకపోతున్నానని, అందుకే డాక్టర్‌ అవుదామని అనుకుంటున్నానని అలియా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. దీంతో ప్రధాని కాసేపు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.     

డబ్ల్యూహెచ్‌ఓలో సంస్కరణలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)లో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చే విషయంలో ఒక సరళమైన విధానాన్ని తీసుకురావాలన్నారు. మేధో సంపత్తి హక్కులు మంజూరు చేసే విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను సరళం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆధ్వర్యంలో కోవిడ్‌–19పై గురువారం నిర్వహించిన రెండో గ్లోబల్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు.  అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాపోసా పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు