‘తీరా’ కోసం రూ. 6 కోట్లు మాఫీ చేసిన కేంద్రం

11 Feb, 2021 20:58 IST|Sakshi

రూ. 16 కోట్ల ఇంజక్ష‌న్‌.. జీఎస్టీ, దిగుమతి సుంకం మాఫీ చేసిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: తీరా కామత్‌.. ఈ చిన్నారి గుర్తుందా.. ‘స్పైనల్‌ మస్య్కులర్‌ అట్రోఫీ’ అనే జన్యుపరమైన లోపంతో పుట్టింది. పాపను బ్రతికించుకోవాలంటే జీనీ థెరపీ తప్పని సరైంది. మన దేశంలో ఈ చికిత్స లేదు. అమెరికా నుంచి 16 కోట్ల రూపాయల విలువైన ‘జోల్‌జెన్‌స్మా’ అనే ప్రత్యేక ఇంజెక్షన్ తెప్పిస్తే కొంతవరకు ప్రయోజనం ఉండొచ్చని డాక్టర్లు తెలిపారు. జీవితాంతం కష్టపడినా.. తీరా తల్లిదండ్రులు ఈ మొత్తాన్ని సమకూర్చలేరు. ఈ క్రమంలో తమ బిడ్డను ఆదుకోవాల్సిందిగా కోరుతూ.. ఆ తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టారు. దేవుడి దయ వల్ల అనుకున్న మొత్తాన్ని జమ చేశారు.

భారీ మొత్తంలో ట్యాక్స్‌
డబ్బు జమ అయ్యింది.. ఇక ఇంజక్షన్‌ తెప్పించడమే తరువాయి అనుకుంటుండగా మరో షాకింగ్‌ విషయం తెలిసింది. ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టి అమెరికా నుంచి తెప్పించే ఈ ఇంజక్షన్‌ను మనం దిగుమతి చేసుకోవాలంటే జీఎస్టీ, దిగుమతి సుంకం అన్ని కలిపి 6.5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇంజక్షన్‌కు అవసరమ్యే మొత్తాన్నే క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా సమకూర్చారు. అలాంటిది ఇంత భారీ మొత్తంలో పన్ను చెల్లించలేమని ‘తీరా’ తల్లిదండ్రులు వాపోయారు. ట్యాక్స్‌ తగ్గించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం మానవతా దృక్పథంతో ఇంజక్షన్‌పై అన్ని రకాల పన్నులను మాఫీ చేసింది. 

మోదీపై ప్రశంసలు...
ఈ విషయాన్ని బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 'చిన్నారి తీరా కామత్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత మానవతా దృక్పథంతో వ్యవహరించి జోల్‌జెన్‌స్మా డ్రగ్‌పై కస్టమ్స్ డ్యూటీని మినహాయించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అంటూ ఫడ్నవీస్ ట్వీట్‌ చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ప్రస్తుతం ముంబై ఆస్పత్రిలో చికిత్స 
చిన్నారి తీరాకు ప్రస్తుతం ముంబైలోని ఎస్‌ఆర్‌సీసీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వెన్నెముక కండరాల క్షీణత వల్ల తలెత్తే సమస్యలతో ఈ చిన్నారి బాధపడుతోంది. ఇప్పటికే తీరా ఊపిరితిత్తులలో ఒకటి పని చేయడం మానేసింది. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే వెంటిలేటర్‌పై ఎక్కువ కాలం ఉంచితే ట్యూబ్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో చిన్నారికి వీలైనంత త్వరగా ఆ ఇంజెక్షన్ అందించాల్సి ఉంది. జోల్‌జెన్‌స్మా ద్వారా ఆ చిన్నారిలో బలహీనంగా ఉన్న కండరాలు మళ్ళీ మెదడు నుండి సంకేతాలను పొందే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

చదవండి: ఈ పాప ‍బ్రతకాలంటే 16 కోట్లు కావాలి

మరిన్ని వార్తలు