రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష: నెలలోపు అలా జరగకుంటే పదవి పోవడం ఖాయం

23 Mar, 2023 14:30 IST|Sakshi

సాక్షి వెబ్‌డెస్క్‌: ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో.. మోదీ ఇంటి పేరును ప్రస్తావించి చేసిన వ్యాఖ్యలు అంతిమంగా రాహుల్‌ గాంధీకి చిక్కులు తెచ్చిపెట్టాయి. నాలుగేళ్ల కిందట ఆయనపై నమోదైన పరువు నష్టం కేసులో(Criminal Defamation Case) .. ఇవాళ(గురువారం) రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది గుజరాత్‌ సూరత్‌ కోర్టు.

అయితే ఆ వెంటనే బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు తీర్పును సవాల్‌ చేస్తూ అప్పీల్‌ చేసుకునేందుకు ఆయనకు 30 రోజుల గడువు ఇచ్చి కాస్త ఊరట అందించింది. ఇక తీర్పు వెలువడిన వెంటనే మహాత్మా గాంధీని ప్రస్తావిస్తూ.. సత్యమే నా దేవుడు, అహింస దానిని పొందే సాధనం అంటూ ట్వీట్‌ చేశారు రాహుల్‌ గాంధీ. అలాగే.. కాంగ్రెస్‌ కీలక నేతలు, పార్టీ శ్రేణులు సైతం రాహుల్‌ గాంధీకి సంఘీభావంగా స్టేట్‌మెంట్‌లు, సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి.

ఏం జరగనుందంటే.. 
బెయిల్‌ దక్కించుకున్న కాంగ్రెస్‌​ ఎంపీ రాహుల్‌ గాంధీ.. ముప్పై రోజుల్లోగా తీర్పును సవాల్‌ చేస్తూ అభ్యర్థన పిటిషన్‌ దాఖలు చేయొచ్చు. అయితే..  ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 8(3) ప్రకారం.. పార్లమెంట్‌ సభ్యుడు ఎవరికైనా సరే.. ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష పడితే మాత్రం.. అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు. ఈ లెక్కన రాహుల్‌ గాంధీకి పదవీ గండం పొంచి ఉందనే చెప్పొచ్చు. 

మరోవైపు ఐపీసీ సెక్షన్‌ 499 ప్రకారం.. క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసు( నేరపూరిత పరువునష్టం దావా) కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడడం అనేది చాలా అరుదైన సందర్భమని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు రాహుల్‌ గాంధీ తనకు పడిన శిక్షకు అప్పీల్‌కు గనుక వెళ్లపోతే ఆయన ఎంపీ పదవినీ కోల్పోవాల్సి వస్తుంది. అయితే.. పరిస్థితి అంతదాకా రాదని, ఆయన తీర్పును అప్పీల్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ అప్పీల్‌ను కోర్టు తిరస్కరించినా.. ఆదేశాల(జైలు శిక్ష విధింపు) నిలుపుదలకు నిరాకరించినా సరే.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

ఏం జరిగిందంటే.. 
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో.. కర్ణాటక కోలార్‌ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన ప్రధాని మోదీని టార్గెట్‌ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ పేర్లను సైతం ప్రస్తావిస్తూ.. మోదీ ఇంటి పేరుతో ఉన్నవాళ్లంతా.. అంటూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ, సూరత్‌ కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో నాలుగేళ్ల పాటు వాదనలు కొనసాగగా.. గత వారం ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్‌ చేసింది సూరత్‌ కోర్టు. ఇక ఇవాళ(గురువారం) రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ సూరత్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుకుగానూ స్టేట్‌మెంట్‌ రికార్డు కోసం మధ్యలో 2021 అక్టోబర్‌లో రాహుల్‌ గాంధీ సూరత్‌ కోర్టులో హాజరయ్యారు కూడా.  

రాహుల్‌ టార్గెట్‌ చేసుకుంది ప్రధాని నరేంద్ర మోదీని అని, ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీని కాదని, కాబట్టి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని రాహుల్‌ గాంధీ తరపు న్యాయవాది వాదించారు. అయితే చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్‌ వర్మ మాత్రం రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనవని, పూర్ణేశ్‌ పరువుకు భంగం కలిగించేవని తేల్చి.. రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు.

ఇదీ చదవండి: అప్పటిదాకా పోటీచేయను!

మరిన్ని వార్తలు