Rahul Gandhi: మోదీ ఇంటి పేరు వివాదం.. రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట..

24 Apr, 2023 17:49 IST|Sakshi

పట్నా: కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట లభించింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది.

మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ.. 2019లో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు రాహల్‌ను ఏప్రిల్‌ 12న కోర్టు ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించింది. అయితే తాను సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసే పనిలో ఉన్నానని, కోర్టుకు హాజరుకాలేనని రాహుల్ చెప్పారు. దీంతో న్యాయస్థానం అందుకు అంగీకరించింది. ఏప్రిల్ 25న హాజరుకావాలని చెప్పింది.

అయితే మోదీ ఇంటిపేరు కేసుకు సంబంధించి ఇప్పటికే సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. దీంతో ఓకే కేసుకుసంబంధించి రెండు కోర్టుల్లో విచారణ జరగడం చట్టవిరుద్ధమని, సుషీల్ మోదీ పిటిషన్‌ను కొట్టివేయాలని రాహుల్ పట్నా హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం మే 15 వరకు దిగువ కోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

కాగా.. 2019లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. దేశంలో దొంగల ఇంటి పేరు మోదీ అనే ఎందుకు ఉందని రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సూరత్ కోర్టులో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పరువునష్టం పిటిషన్ వేశారు. రాహుల్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం రాహుల్‌ ఎంపీ పదవి కూడా పోయింది. ఆయనపై లోక్‌సభ సెక్రెటేరియెట్ అనర్హత వేటు వేసింది. ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను కూడా ఖాళీ చేయించింది.
చదవండి: కమెడియన్‌ మునావర్ ఫరూకీకి ఊరట.. ఇండోర్‌కు అన్ని కేసులు బదిలీ

మరిన్ని వార్తలు