‘మోదీ.. దొంగలు’ కామెంట్‌: మేజిస్ట్రేట్‌కు రాహుల్‌ ఏం చెప్పాడంటే..

24 Jun, 2021 16:14 IST|Sakshi

‘‘నీరవ్‌.. లలిత్‌.. నరేంద్ర మోదీ.. ఇలా ఈ దొంగలంతా ఒకే ఇంటిపేరుతో ఉండడం ఎలా?’’ అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. ఆ టైంలో రాహుల్‌కి వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేశాడు ఓ బీజేపీ నేత. ఈ కేసుకు సంబంధించి గురువారం సూరత్‌ కోర్టులో ప్రత్యక్షంగా హాజరైన రాహుల్‌.. మేజిస్ట్రేట్ ముందు తన చివరి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 

సూరత్‌: తనకు వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తుది వాంగ్మూలం ఇచ్చారు. ‘‘నేను ఏ కమ్యూనిటీని లక్క్ష్యంగా చేసుకుని ఆ కామెంట్‌ చేయలేదు. కేవలం ఆ సమయానికి వ్యంగ్యం ప్రదర్శించా అంతే. అంతకుమించి నాకేం గుర్తులేదు’’ అని రాహుల్‌ కోర్టుకు తెలియజేశారు. కాగా, ఈ కేసులో స్వయంగా హాజరై స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని వారం క్రితమే రాహుల్‌ను మేజిస్ట్రేట్ ఏఎన్‌ దవే ఆదేశించారు. ఇక ఇరువర్గాల స్టేట్‌మెంట్స్‌ రికార్డు పూర్తి కావడంతో జులై 12 నుంచి ఈ కేసులో కోర్టులో వాదనలు జరగనున్నాయి.     

కాగా, 2019లో కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఏప్రిల్‌13న కోలార్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ తన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశాడు. అయితే మోదీ ఇంటిపేరుతో ఉన్నవాళ్లంతా దొంగలే అని అర్థం వచ్చేలా రాహుల్‌ మాట్లాడాడని, ప్రధానిని అగౌరవపరిచారని, తన పరువుకూ భంగం కలిగిందని చెబుతూ బీజేపీ నేత పూర్ణేష్‌ మోదీ, రాహుల్‌పై దావా వేశాడు. ఈ కేసులో 2019 అక్టోబర్‌లోనే రాహుల్‌ ఇంతకు ముందు హాజరై.. ఆరోపణల్ని నమోదు చేయొద్దని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని కోర్టును అభ్యర్థించారు కూడా.

చదవండి: ఆత్మనిర్భర్‌ అంటే..:రాహుల్‌ గాంధీ

మరిన్ని వార్తలు