Modi's USA visit: గ్లోబల్ సీఈఓలతో సమావేశం కానున్న ప్రధాని మోదీ

22 Sep, 2021 20:50 IST|Sakshi

న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు కొద్ది క్షణాల క్రితమే మోదీ న్యూఢిల్లీ నుంచి అగ్రరాజ్యానికి పయనమయ్యారు. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఆహ్వానం మేర‌కు తాను ఆ దేశానికి వెళ్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రెండు దేశాల మ‌ధ్య స‌మ‌గ్ర‌మైన వాణిజ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం గురించి స‌మీక్షించ‌నున్న‌ట్లు మోదీ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 23న వాషింగ్టన్ డీసీలో గ్లోబల్ సీఈఓలతో సమావేశం కానున్నారు. క్వాల్ కామ్, అడోబ్, బ్లాక్ స్టోన్, జనరల్ అటామిక్స్, ఫస్ట్ సోలార్ అధిపతులు ప్రధానిని కలవనున్నారు.

ప్రధాన మంత్రి శ్రీ మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌‌ను గురువారం(సెప్టెంబర్ 23) వాషింగ్టన్‌లో కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే, క్వాడ్ నేత‌ల స‌ద‌స్సులోనూ పాల్గొన‌నున్న‌ట్లు మోదీ తెలిపారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మోదీకి సెప్టెంబర్ 24న వైట్ హౌస్ లో ప్రధాని మోడీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. అమెరికాతో భారత ద్వైపాక్షిక సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులు, రక్షణ రంగాలు, అఫ్ఘానిస్థాన్‌లోని పరిస్థితులు, ఉగ్రవాద నిరోధం, ఇండో-పసిఫిక్‌, వాతావరణ మార్పులు వంటి అంశాలపై బైడెన్‌తో మోదీ చర్చలు జరపనున్నట్లు సమాచారం.

ఈ ఏడాది జనవరిలో బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇరువురు నాయకుల మధ్య జరగబోయే తొలి వ్యక్తిగత సమావేశం ఇదే. ప్రధాని మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తర్వాత ప్రధాని మోడీ విదేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి.
 

మరిన్ని వార్తలు