ప్రత్యేక డీజీపీ సస్పెన్షన్

20 Mar, 2021 14:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆ పదవికి ఇద్దరి పేర్ల సిఫారసు 

సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్యేక డీజీపీ రాజేష్‌దాసు సస్పెండ్‌ అయ్యారు. ఆ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవికి ఇద్దరు డీజీపీ స్థాయి హోదా అధికారుల పేర్లు సిఫారసు చేశారు. మహిళా ఐపీఎస్‌ అధికారి రాజేష్‌దాసుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఆమె ఫిర్యాదు మేరకు కేసును సీబీసీఐడీకి డీజీపీ త్రిపాఠి అప్పగించారు. దీంతో విచారణపై సీబీసీఐడీ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంపై విల్లుపురంలో విచారణ సాగగా, ప్రస్తుతం చెన్నైకు విచారణ చేరింది. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించే పనిలో పడింది.

ఇక విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు చెంగల్పట్టు ఎస్పీగా ఉన్న కన్నన్‌ మెడకు ఉచ్చు బిగుసుకుంది. ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. సస్పెండ్‌ కూడా చేశారు. ఆ మహిళా అధికారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నందుకే కన్నన్‌ ఈ కేసులో చిక్కుకున్నారు. అయితే, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్యేక డీజీపీ వద్ద కేవలం విచారణ మాత్రమే సాగినా, సస్పెండ్‌ చర్యలు తీసుకోలేదు. ఇదే విషయంగా మద్రాసు హైకోర్టు స్పందించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ సైతం దృష్టి పెట్టింది. దీంతో వెయిటింగ్‌ లిస్టులో ఉన్న ఈ ప్రత్యేక డీజీపీని సస్పెండ్‌ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవికి డీజీపీ హోదా కల్గిన అభాష్‌కుమార్, అభయ్‌ కుమార్‌సింగ్‌లలో ఒకర్ని నియమించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఇద్దరి పేర్లను ఎన్నికల కమిషన్‌కు సిఫారసు చేశారు. 

చదవండి: ఆరు నెలల్లో ముగించాల్సిందే: హైకోర్టు ఆగ్రహం
ఆ డీజీపీపై 3 కేసులు: దృష్టి సారించిన హైకోర్టు

>
మరిన్ని వార్తలు