దంతేవాడ మావోయిస్టుల ఘాతుకం: పేలుడు టైంలోని వీడియో బయటకు..

27 Apr, 2023 13:03 IST|Sakshi

రాయ్‌పూర్‌: ఒక డ్రైవర్‌ సహా పది మంది పోలీసులను పొట్టబెట్టుకున్న మావోయిస్టుల ఘాతుకంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత మావోయిస్టులు భారీ దెబ్బ తీశారు. అయితే దంతేవాడ్‌ పేలుడు ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. పేలుడు తర్వాత.. ఓ పోలీస్‌ సిబ్బంది అక్కడే ఉన్న మావోయిస్టులపై కాల్పులు జరపడానికి యత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. 

పేలుడు తర్వాత.. మరో వాహనంలో ఉన్న పోలీస్‌ సిబ్బంది ఒకరు అక్కడే ఉన్న మావోయిస్టుల వైపుగా వెళ్తూ.. కాల్పులు జరిపేందుకు పొజిషన్‌ తీసుకుంటూ కనిపించాడు. ఓ వాహనం కింద దాక్కున్న మరో పోలీస్‌ సిబ్బంది అక్కడి పరిస్థితులను తన ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోలో పేలుడు జరిగిన ప్రదేశం కనిపిస్తోంది. ‘‘వాహనం మొత్తం పేల్చేశారు..’’  అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వాయిస్‌ వినిస్తోంది.  పేలుడు ధాటికి పడిన పదడుగుల లోతు గుంత అంచులనూ క్లిప్‌లో చూడొచ్చు. ఇక క్లిప్ చివరిలో, తుపాకీ శబ్దాలు వినిపించాయి. 

ఆ వీడియో చిత్రీకరించిన పోలీస్‌ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ.. డిస్ట్రిక్‌ రిజర్వ్‌ గార్డ్‌((DRG) తరపున మేం యాంటీ మావోయిస్ట్‌ ఆపరేషన్‌లో మంగళవారం నుంచి పాల్గొంటున్నాం. బుధవారం మధ్యాహ్నం 1.30 గం. ప్రాంతంలో తిరుగుపయనం అయ్యాం. పేలిన వాహనానికి 100-150 మీటర్ల దూరంలో మేం ప్రయాణిస్తున్న ఎయూవీ ఉంది. మా వాహనంలో మేం ఏడుగురం ఉన్నాం.  మొత్తం ఏడు వాహనాల కాన్వాయ్‌లో.. మూడో వాహనం మావోయిస్టులకు లక్ష్యంగా మారిందని తెలిపారు. పేలుడు ధాటికి ఆ వాహనంలో ఉన్న ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు. అంతా చనిపోయారు అని ఆయన తెలిపారు. 

మేం వాళ్లున్న దిశలో కాల్పులు జరిపాం. వాళ్ల వైపు నుంచి ఒకటి రెండు రౌండ్ల కాల్పులు మాత్రమే వినిపించాయి. ఆ తర్వాత కాల్పులు ఆగిపోయాయి అని ఆ సిబ్బంది తెలిపారు. కాన్వాయ్‌లోని ఏడు వాహనాల్లో మొత్తంలో 70 మంది సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు. 

మరిన్ని వార్తలు