10 ఏళ్లకుపైగా ఎత్తిన చేతిని దించలేదు.. సాధువు వీడియో వైరల్‌!

26 Sep, 2022 15:18 IST|Sakshi
దశాబ్దకాలంగా కుడి చేతిని పైకి ఎత్తి ఉంచిన సాధువు

మీ చేతిని పైకి ఎత్తి ఎంత సమయం వరకు ఉండగలరు? మహా అయితే ఓ 10-20 నిమిషాలు అతి కష్టంతో పైకి ఎత్తి ఉంచగలరేమో. కానీ, గంటలు కాదు, రోజులు కాదు.. ఏళ్ల తరబడి ఎత్తిన చేతిన దించకుండా ఉండటం అంటే నమ్మశక్యంగా లేదు కదా. అయితే, అది నిజం. ఓ సాధువు దానిని గతంలోనే చేసి చూపించారు. 70 ఏళ్ల సాధువు అమర్‌ భర్తీ.. సుమారు 50 ఏళ్లకుపైగా తన కుడి చేతిని పైకే ఎత్తి ఉంచినట్లు అప్పట్లో తెగవైరల్‌గా మారింది. తొలి రెండేళ్లు తీవ్రంగా నొప్పి ఉండేదటా! కానీ అది క్రమంగా తగ్గిపోయిందని, ఆ తర్వాత ఎలాంటి నొప్పిలేదని సాధువు అమర్‌ భర్తీ వెల్లడించారు. మరోవైపు.. ఆ చేతికి రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోవటం వల్లే ఎలాంటి నొప్పి కలగటం లేదని, ఇకపై ఆ చేతిని కిందకు దించలేదని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. 

1973 వరకు అమర్‌ భర్తీ ఒక సాధారణ వ్యక్తే. అందరిలా వివాహం చేసుకుని పిల్లాపాలతో జీవించేవారు. ఆ తర్వాత తన జీవితాన్ని శివుడికి అంకితం చేయాలని నిశ్చయించుకుని సాధువుగా మారారు. తనలోని శివుడిపట్ల ఉన్న నిబద్ధతను చాటుకునేందుకు కుడి చేతిని పైకి ఎత్తి ఉంచటం మొదలు పెట్టారు. భర్తీ అంశం 2020లోనే వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే భర్తీ లాగే మరో వ్యక్తి చేతిని పైకి ఎత్తి ఉంచుతుండటం వెలుగులోకి వచ్చింది. అమర్‌ భర్తీ 50 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేయలేకపోయినా.. తనకు సాధ్యమైనంత మేరకు చేతిని పైకి ఎత్తే ఉంచుతానని చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా చేతిని పైకి ఎత్తే ఉంచానని వెల్లడించారు. ఓ రిపోర్టర్‌ సాధువుతో మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎన్ని రోజుల పాటు ఇలా చేతిని పైకి ఎత్తి ఉంచుతారని విలేకరి ప్రశ్నించగా..  ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. చేతిని పైకి ఉంచే నిద్రపోతానని, ఆ సమయంలోనూ ఎలాంటి ఇబ్బంది కలిగినట్లు అనిపించదని  తెలిపారు.

ఇదీ చదవండి: Viral Video: హీరో లెవల్లో యువకుడి బైక్‌ స్టంట్‌.. ఝలక్‌ ఇచ్చిన పోలీసులు

>
మరిన్ని వార్తలు