బాలరామున్ని దర్శించుకున్న హనుమాన్..! ఆలయంలో ఆసక్తికర ఘటన

24 Jan, 2024 19:05 IST|Sakshi

లక్నో: అయోధ్య రామాలయ గుడిలో విచిత్రమైన ఘటన జరిగింది. బాలరాముడు కొలువై ఉన్న గర్భగుడిలోకి ఓ వానరం ప్రవేశించింది. మంగళవారం సాయంత్రం సమయంలో గుడి దక్షిణ ద్వారం గుండా ఓ కోతి ప్రవేశించింది. కొత్త ఆలయాన్ని నిర్మించడానికి ముందు గుడారంలో ఉంచిన బాలరాముని పాత విగ్రహాన్ని చేరుకుంది. ఈ విషయాన్ని అయోధ్య రామాలయ ట్రస్టు ట్విట్టర్ వేదికగా పంచుకుంది. 

విగ్రహం భద్రత గురించి భద్రతా సిబ్బంది ఆందోళన చెంది, కోతి వైపు పరుగెత్తారు. అయితే, కోతి ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఉత్తర ద్వారం వైపు వెళ్లింది. అది మూసివేసి ఉండటంతో భక్తుల రద్దీని దాటి ఎలాంటి హాని చేయకుండా తూర్పు ద్వారం గుండా వెళ్లిపోయింది. బాలరామున్ని దర్శించేందుకు హనుమంతుడు స్వయంగా వచ్చాడని కోతి సందర్శనను దైవానుగ్రహంగా భక్తులు భావించారని ట్రస్ట్ తెలిపింది. 

కోతిని హనుమంతుని రూపంగా భక్తులు భావిస్తారు. అయితే.. అక్టోబర్ 30, 1990న బాబ్రీ మసీదుపై కరసేవకులు జెండాలను ఎగురవేశారు. ఈ క్రమంలో కరసేవకులను భద్రతా బలగాలు చెదరగొట్టాయి. ఈ క్రమంలో మసీదు గోపురంపై కరసేవకులు అమర్చిన జెండాను తొలగించకుండా ఓ కోతి కాపాడింది.

ఇదీ చదవండి: కేంద్ర మంత్రులు అయోధ్యకు వెళ్లకండి: మోదీ
 

whatsapp channel

మరిన్ని వార్తలు