ఏనాటి బంధమిది.. తల్లిని కూడా దగ్గరకి రానివ్వలేదు

20 Mar, 2021 14:02 IST|Sakshi
చిన్నారిని ఆడిస్తున్న కోతి

సోషల్‌ మీడియా వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో.. అదే రేంజ్‌లో లాభం కూడా ఉంటుంది. వాస్తవంగా సోషల్‌ మీడియా వినియోగం పెరిగిన తర్వాత జరిగిన అద్భుతాలు అనేకం ఉన్నాయి. సోషల్‌ మీడియా వల్ల సామాన్యులు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిన ఘటనలు కోకొల్లలు. ఇక గుండెని మెలిపెట్టే విషాదాలు.. కంట తడి పెట్టించే కథనాలు.. స్ఫూర్తి రగిలించే అంశాలు ఎన్నో సోషల్‌ మీడియా ద్వారా తెగ ప్రచారం పొందాయి. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఆ వివరాలు.. కోతుల్ని చూడగానే కాస్త కంగారు పడతాం. ఎక్కడ మీద పడి దాడి చేస్తాయేమో అని భయపడతాం... మన దగ్గర ఏవైనా వస్తువులు ఉంటే కోతులు లాక్కెళ్లిపోతాయేమో అని టెన్షన్ పడతాం... అలాంటిది ఈ వీడియోలో... కోతి ఓ చిన్నారిని ఆప్యాయంగా హత్తుకొని... తల నిమిరి... ముద్దులు పెట్టుకొని... ప్రేమ కురిపించింది. ఇద్దరి మధ్య ఏ జన్మ అనుబంధమో ఏమో కానీ కనీసం కన్న తల్లికి కూడా బిడ్డను ఇవ్వలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 

ఓ రోడ్డుపై ఉన్న చిన్నారికి కోతి రక్షణ కల్పించింది. "నువ్వేం కంగారు పడకు... నీకు నేనున్నాను... నిన్ను బంగారంలా చూసుకుంటాను" అని అన్నట్లుగా ఆ కోతి వ్యవహరించింది. తన బిడ్డను తనకు ఇచ్చేయమని ఆ తల్లి అడుగుతుంటే... కోతి ఇవ్వకుండా... కనీసం పిల్లాడిపై ఆ తల్లిని చెయ్యి కూడా వెయ్యనివ్వకుండా జాగ్రత్త పడింది. తన కొడుకును అంత జాగ్రత్తగా చూసుకుంటున్న కోతి నుంచి ఎలా తనని వెనక్కి తీసుకోవాలో ఆ తల్లికి అర్థం కాలేదు. తన కొడుకును ఇవ్వమని బతిమాలింది. ఎందుకో ఏమో కానీ కాసేపటి వరకు కోతి ఆ చిన్నారిని తల్లికి అప్పగించలేదు. ఆ తర్వాత ఎప్పటికో బిడ్డను అక్కడే వదిలి వెళ్లిపోయింది. 

చదవండి: ఎంతబాగా ప్రార్థన చేస్తున్నాడో; ఓర్నీ అసలు సంగతి ఇదా!

మరిన్ని వార్తలు