తాగుబోతు కోతి.. లిక్కర్‌ బాటిళ్లు చోరీ చేస్తూ లాగించేస్తోంది!

1 Nov, 2022 21:15 IST|Sakshi

లక్నో: ఎవరైనా పిచ్చిగా ప్రవర్తిస్తే ‘కల్లు తాగిన కోతి లెక్క చేస్తున్నవ్‌’ అంటారు. కానీ, నిజానికి కోతి కల్లు తాగటం చూసినవారు చాలా తక్కువ. అలాంటిది లిక్కర్‌కు బానిసైన వానరాలూ ఉన్నాయంటే నమ్ముతారా? కానీ, ఓ కోతి ఏకంగా వైన్స్‌ షాప్‌లోకి దూరి చోరీ చేస్తోంది. మద్యం మత్తులో తూలుతూ జల్సా చేస్తోంది. బీరు బాటిల్‌ ఎత్తి తాగుతున్న ఓ కోతి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో లిక్కర్‌కు అలవాటు పడిన ఓ కోతి షాపుల్లో దూరి మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిపోతోందంటూ స్థానిక వైన్స్‌ షాపుల విక్రయదారులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఓ కోతి మద్యం తాగుతూ ఎవరైనా కనిపిస్తే వారి దగ్గర నుంచి బాటిళ్లు లాక్కుని పారిపోతోందని స్థానికులు చెబుతున్నారు. అడ్డుకోవడానికి చూస్తే మీద పడి కరిచేందుకు సైతం ఎనకాడటం లేదటా. దీంతో వైన్స్‌ షాపులకు వచ్చి మందు కొనాలంటేనే భయపడుతున్నారటా మద్యం ప్రియులు. మొత్తానికి ఈ తాగుబోతి వానరం అక్కడి వారికి చుక్కలు చూపిస్తోంది. 

రాయ్‌బరేలీ జిల్లాలోని గడాగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అచల్‌గంజ్‌ ప్రాంతంలో ఓ కోతి బీరు తాగుతున్న వీడియో తెగ వైరల్‌గా మారింది. ఫిర్యాదులు పెరిగిపోతున్న క్రమంలో అటవీ శాఖ అధికారులతో కలిసి కోతులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కేబుల్‌ బ్రిడ్జిపైకి కారు..‘మోర్బీ’ విషాదం చూశాకైనా మారరా?

మరిన్ని వార్తలు