Monkeypox Virus In India: భారత్‌లో మంకీపాక్స్‌ కలకలం.. పెరుగుతున్న కేసులు

24 Jul, 2022 13:04 IST|Sakshi

మంకీపాక్స్‌.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, ప్రపంచ దేశాలకు వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. 

ప్రస్తుతం భారత్‌లో సైతం మంకీపాక్స్‌ కేసులు పెరుగుతుండటం టెన్షన్‌ పెడుతోంది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో మరో పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. దీంతో దేశంలో మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఢిల్లీలో 34 ఏళ్ళ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. కాగా, బాధితుడికి విదేశాల్లో పర్యటించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో, అతడిని మౌలానా అజాద్ మెడికల్ కాలేజీలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. 

అయితే, అతడు జ్వరం, చర్మంపై దద్దుర్లతో బాధపడ్డాడని.. దీంతో శాంపిళ్ళను పూణెలోకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ వైరాలజీకి పంపగా మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు వివరించారు. శనివారం వరకు దేశంలో మూడు మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూశాయి. మూడు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదవ్వడం గమనార్హం. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో కలిపి 16,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటివరకు ఐదుగురు బాధితులు మృతిచెందారు. 

ఇది కూడా చదవండి: మంకీపాక్స్‌పై డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన

మరిన్ని వార్తలు