‘మోనో’ ఆవరణల్లో ప్రకటనలు 

9 Aug, 2021 04:50 IST|Sakshi

ఆదాయం పెంచుకునేందుకు నిర్ణయం

ప్రకటనలకు టెండర్లు ఆహ్వానించిన ఎమ్మెమ్మార్డీయే

టెండర్లు దాఖలు చేసేందుకు ఆగస్టు 11 వరకు గడువు

సాక్షి, ముంబై: ప్రారంభమైన నాటి నుంచి నష్టాల్లోనే నడుస్తున్న మోనో రైలు ప్రాజెక్టు కరోనా మహమ్మా రి ప్రభావంతో మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది. కరోనా, లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులెవరూ మోనో రైళ్లలో ప్రయాణించేందుకు సుముఖత చూపలేదు. దీంతో మోనో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ప్రతీరోజు రూ. లక్షల్లో నష్టం వస్తోంది. ఇలా ఆర్థికంగా నష్టాల బాట పట్టిన మోనో ప్రాజెక్టును లాభాల దిశగా నడపాలని ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎమ్మెమ్మార్డీ యే) భావించింది. ఈ మేరకు ఆదాయం పెంచుకు నే మార్గాలను అన్వేషించింది. ఇందులో భాగంగానే మోనో రైల్వే స్టేషన్ల ఆవరణలు, ప్లాట్‌ఫారాలు, మోనో రైలు మార్గం వెంబడి ఉన్న పిల్లర్లు, ప్రహరీ గోడలు, ఇతర స్థలాలను ప్రకటనల కోసం అద్దెకు ఇవ్వాలని ఎమ్మెమ్మార్డీయే పరిపాలనా విభాగం నిర్ణయించింది. ఈ మేరకు ఆసక్తి గల కంపెనీలు టెండర్లు దాఖలు చేయాలని ఆహ్వానించింది. ప్రస్తు తం నగరంలోని చెంబూర్‌–సాత్‌రాస్తా ప్రాంతాల మధ్య మోనో రైళ్లు నడుస్తున్నాయి. ప్రతీరోజు నష్టం వస్తున్నా కూడా సంస్థకు వీటి ట్రిప్పులను నడపక తప్పడం లేదు. దీంతో టికెట్ల ద్వారా ఆదాయం రాకపోయినప్పటికీ, ప్రకటనల ద్వారానైనా ఆదా యం రాబట్టుకోవాలని సంస్థ భావించింది. ఈ మేరకు ప్రకటనల ద్వారా ఏటా రూ. 40–50 కోట్ల మేర ఆదాయం సంపాదించేందుకు ఎమ్మెమ్మార్డీయే ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఎమ్మెమ్మార్డీయే అధికారులు కొన్ని కంపెనీలతో ఇప్పటికే చర్చలు జరిపారు. కానీ, అవి సఫలం కాలేదు. దీంతో టెండర్లను ఆహ్వానించాలని ఎమ్మెమ్మార్డీయే పరిపాలనా విభాగం నిర్ణయించింది. ఈ నెల 11వ తేదీలోపు టెండర్లు దాఖలు చేయాలని గడువు విధించింది. దాఖలైన టెండర్లను 12వ తేదీన తెరవనున్నారు. ఈ టెండర్లలో ఎవరు ఎక్కువ చెల్లించడానికి ముందుకు వస్తారో వారి ప్రకటనలను మోనో రైల్‌ ఆవరణల్లో ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు