Monsoon session: ఆగని వాయిదాల పర్వం

23 Jul, 2022 04:03 IST|Sakshi

పార్లమెంట్‌ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన

సోమవారం మధ్యాహ్నానికి వాయిదా

గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాల ధర్నా  

సాక్షి, న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ ఉభయసభల్లో వరుసగా ఐదో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ధరల పెరుగుదల, జీఎస్టీపై విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. శుక్రవారం ఉదయం లోక్‌సభ ఆరంభమైన వెంటనే ధరలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు తదితర అంశాలపై ప్లకార్డులతో విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.

దీంతో సభను 12 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు, ఆ తర్వాత మళ్లీ సోమవారం మధ్యాహ్నానికి స్పీకర్‌ వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళనల కారణంగా మొదట 12 గంటలకు,  తర్వాత గంట పాటు కొనసాగిన అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు సభ వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుపై చర్చ కొనసాగింది.

ఇక ఉభయ సభల ప్రారంభానికి  ముందు టీఆర్‌ఎస్‌ సహా విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. జీఎస్టీ పెంపును వెనక్కి తీసుకోవాలని, ప్రజా సమస్యలపై పార్లమెంట్‌లో తక్షణమే చర్చించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు కోరారు.  

ఇండియన్‌ అంటార్కిటిక్‌ బిల్లుకు ఆమోదం  
లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన, నినాదాల మధ్యే ఇండియన్‌ అంటార్కిటిక్‌ బిల్లు–2022 ఆమోదం పొందింది. అంటార్కిటిక్‌ ప్రాంతంలో భారత్‌ నెలకొల్పిన పరిశోధనా కేంద్రాల విషయంలో దేశీయ చట్టాలను అమలు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రస్తుత పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన మొదటి బిల్లు ఇదే కావడం విశేషం. బిల్లుపై లోక్‌సభలో స్వల్పచర్చ జరిగింది.  

‘అగ్నిపథ్‌’పై మాట్లాడనివ్వడం లేదు  
డిఫెన్స్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం వాకౌట్‌ చేశారు. అగ్నిపథ్‌ పథకంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అగ్నిపథ్‌పై చర్చించాలని కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు కేసీ వేణుగోపాల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దానిష్‌ అలీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ జువాల్‌ ఓరామ్‌ను కోరగా, ఆయన నిరాకరించారు. కేవలం అజెండాలో ఉన్న అంశాలపై చర్చించాలని తేల్చిచెప్పారు. కావాలంటే పార్లమెంట్‌లో అగ్నిపథ్‌ అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నిరసనగా వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు