రూ.600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చిన డాక్టర్‌.. ఎందుకో తెలుసా?

21 Jul, 2022 17:53 IST|Sakshi

ఇతరులకు సాయం చేయాలి అనిపించినా చేసే స్థోమత అందరికీ లేకపోవచ్చు. కొంతమంది ఆ సామర్థ్యం ఉన్నా సాయం చేసేందుకు మనసు ఒప్పదు. కానీ ఇందుకు భిన్నంగా కొందరు తమ స్థాయి గురించి ఆలోచించకుండా ప్రజాసేవే పరమావధి జీవిస్తుంటారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అర్వింద్‌ గోయల్‌ అనే డాక్టర్‌ కూడా అ‍చ్చం ఇలాంటి వాడే.  ఏకంగా తన యావదాస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చారు. అయితే ఆస్తి అనేగానే ఏదో 10, 20 లక్షలు, మహా అయితే కోటి రూపాయలు అనుకునేరు.. అక్షరాల 600 కోట్ల విలువైన ఆస్తిని పేదల సంక్షేమం,అభివృద్ధి కోసం యూపీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశారు.

దాదాపు 50 ఏళ్లుగా వైద్య వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న అర్వింద్‌ గోయల్‌ కేవలం తన ఇంటిని మాత్రమే ఉంచుకొని మిగతా ఆస్తినంతా ఇచ్చేశారు. ఆస్తిని ఇచ్చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయం 25 ఏళ్ల క్రితమే తీసుకున్నట్లు తెలిపారు. కాగా రోనా లాక్‌డౌన్‌ సమయంలో వేల మందిని కష్టాల నుంచి ఆదుకున్నారు. మోరదాబాద్‌లోని 50 గ్రామాలను దత్తత తీసుకొని అన్ని రకాల వసతులను ఉచితంగా కల్పించారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం వంటి సదుపాయాలను అందించారు.
చదవండి: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ..

గోయల్‌ 100కు పైగా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులకు ట్రస్టీగా ఉన్నారు.  తన సేవలకుగాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా నలుగురు రాష్ట్రపతుల చేతులమీదుగా పలు పురస్కారాలు అందుకున్నారు. అరవింద్‌కు భార్య రేణు గోయల్‌తో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే కుటుంబసభ్యులు కూడా మద్దతు ఇచ్చారు.

మరిన్ని వార్తలు