మారటోరియం రెండేళ్లు ఉండొచ్చు 

2 Sep, 2020 03:35 IST|Sakshi

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం, ఆర్‌బీఐ 

న్యూఢిల్లీ: బ్యాంకు అప్పులపై విధించిన మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి. కోవిడ్‌–19 లాక్‌డౌన్, ఆంక్షల మూలంగా ఆర్థికవ్యవస్థ మందగించిందని, ఏప్రిల్‌– జూన్‌ త్రైమాసికంలో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో దాదాపు 24 శాతం లోటు నమోదైందని కేంద్రం, ఆర్‌బీఐల తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభావితవర్గాలకు సహాయపడేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి నుంచి ఆర్నెళ్ల పాటు లోన్ల వాయిదాలపై కేంద్రం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఇది ఆగస్టు 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో మారటోరియంను రెండేళ్లు పొడిగించే అవకాశం ఉందని కేంద్రం... అత్యున్నత న్యాయస్థానానికి తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. కిస్తుల్లో వడ్డీ కలిపే ఉంటుందని, వాటి వసూలు వాయిదా వేసినందున బ్యాంకులు వడ్డీపై మళ్లీ వడ్డీ వేస్తున్నాయని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మారటోరియం కాలంలో వడ్డీ వేయకుండా కేంద్రం, ఆర్‌బీఐలను ఆదేశించాలని ఆగ్రావాసి గజేంద్ర శర్మ తన పిటిషన్‌లో కోరారు. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.  

వడ్డీపై మళ్లీ వడ్డీ వేస్తున్న అంశాన్ని బుధవారం విచారిస్తామని సుప్రీం పేర్కొంది. కేంద్రం ఇప్పటికే ఈ విషయంలో అఫిడవిట్‌ను దాఖలు చేసిందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. తమకు ఆ అఫిడవిట్‌ ఇంకా అందలేదని కోర్టు తెలుపగా... బెంచ్‌ అఫిడవిట్‌ను పరిశీలించాలని, రెండు మూడు రోజుల తర్వాత విచారణ జరిపినా, బుధవారమే విచారణకు స్వీకరించినా నష్టమేమీలేదని మెహతా అన్నారు. వడ్డీపై వడ్డీ అంశాన్ని కేంద్రం, ఆర్‌బీఐ, బ్యాంకర్లు కలిసి పరిశీలించే అవకాశమివ్వాలన్నారు. మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని తెలిపారు.   
వాయిదా వేసిన కిస్తులపై వడ్డీని మాఫీ చేయడం ఆర్థిక సహజసూత్రాలకు విరుద్ధమని కేంద్రం తెలిపింది. ఒకవేళ వడ్డీ మాఫీ చేస్తే... క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించిన వారికి అన్యాయం చేసినట్లే అవుతుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు