Morbi bridge collapse: మోర్బీ వంతెన ప్రమాదంలో... 134కు పెరిగిన మృతులు

1 Nov, 2022 04:40 IST|Sakshi
ఘటనాస్థలి వద్ద కొనసాగుతున్న అన్వేషణ

బీజేపీ ఎంపీ కుటుంబం నుంచే 12 మంది బలి

ప్రధాని సమీక్ష, నేడు ఘటనా స్థలికి

మోర్బీ/న్యూఢిల్లీ:  గుజరాత్‌ రాష్ట్రం మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై బ్రిటిష్‌ కాలపు తీగల వంతెన కూలిపోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 134కు పెరిగింది! మరో ఇద్దరి ఆచూకీ దొరకాల్సి ఉంది. సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష సంఘ్వీ ఆదివారం రాత్రి నుంచి అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, త్రివిధ దళాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

దుర్ఘటన నేపథ్యంలో గుజరాత్‌లో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో రోడ్డు షో రద్దు చేసుకోగా కాంగ్రెస్‌ పరివర్తన్‌ సంకల్ప యాత్రను వాయిదా వేసుకుంది. గుజరాత్‌లోనే ఉన్న మోదీ ఈ ఘటనపై సోమవారం రాత్రి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. బాధితులకు అన్ని విధాలా సాయమందించాలని ఆదేశించారు. మంగళవారంఆయన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు.  మోర్బీ వంతెన ప్రమాదంపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు.

బీజేపీ ఎంపీ కుటుంబంలో పెను విషాదం
వంతెన ప్రమాదానికి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్‌ కల్యాణ్‌జీ కుందారియా కుటుంబంలో ఏకంగా 12 మంది బలయ్యారు! వారంతా ఆయన సోదరుడు, సోదరీమణుల కుటుంబాలకు చెందినవారు. వీరిలో ఐదుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. బ్రిడ్జిని చూసేందుకని వెళ్లి తిరిగిరాని లోకాలకు తరలిపోయారంటూ ఎంపీ కంటతడి పెట్టారు. ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

‘అజంతా’కు నిర్వహణ కాంట్రాక్ట్‌  
మోర్బీ వంతెన నిర్వహణ, అపరేషన్‌ కాంట్రాక్ట్‌ను అజంతా ఒరెవా కంపెనీకి అప్పగించారు. సీఎఫ్‌ఎల్‌ బల్బులు, గోడ గడియారాలు, ఎలక్ట్రానిక్‌ బైక్‌ల తయారీకి అజంతా గ్రూప్‌ పేరొందింది. ఎల్‌ఈడీ టీవీలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కాలిక్యులేటర్లు, సెరామిక్‌ ఉత్పత్తులనూ తయారు చేస్తోంది. గ్రూప్‌ వార్షిక టర్నోవర్‌ రూ.800 కోట్ల పైమాటే.

‘ఫిట్‌నెట్‌ సర్టిఫికెట్‌’ లేకుండానే..  
బ్రిడ్జికి ఫిట్‌నెట్‌ సర్టిఫికెట్‌ జారీ చేయలేదని మున్సిపల్‌ చీఫ్‌ ఆఫీసర్‌ సందీప్‌ సింగ్‌ చెప్పారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండానే దాన్ని పునఃప్రారంభించారని తెలిపారు. ‘‘వంతెనపైకి 20–25 మందిని ఒక గ్రూప్‌గా అనుమతిస్తుంటారు. కానీ నిర్వాహక సంస్థ అజంతా ఒరెవా నిర్లక్ష్యంగా ఒకేసారి దాదాపు 500 మందిని వెళ్లనిచ్చింది. అదే ఘోర ప్రమాదానికి దారి తీసింది’’ అన్నారు.

9 మంది అరెస్టు
ప్రమాదానికి సంబంధించి ఇప్పటిదాకా 9 మందిని అరెస్టు చేసినట్లు గుజరాత్‌ పోలీసులు తెలియజేశారు. బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టును పొందిన అజంతా ఒరెవా కంపెనీపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఐపీసీ సెక్షన్‌ 304, సెక్షన్‌ 308 కింద కేసు పెట్టామన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన నిందితుడి స్థానంలో అజంతా కంపెనీ పేరు చేర్చామన్నారు. పూర్తి వివరాలు బయటపెట్టేందుకు నిరాకరించారు. అరెస్టయిన 9 మందిలో అజంతా ఒవెరా గ్రూప్‌నకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టిక్కెట్‌ బుకింగ్‌ క్లర్కులు ఉన్నారు.  

బతుకుతెరువు కోసం వెళ్లి బలయ్యాడు  
బర్ధమాన్‌:  పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం పూర్బ బర్ధమాన్‌ జిల్లా కేశబ్బతి గ్రామానికి చెందిన 18 ఏళ్ల షేక్‌ హబీబుల్‌ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పదో తరగతితోనే చదువు ఆపేశాడు. బతుకు తెరువు కోసం గుజరాత్‌లోని మోర్బీకి చేరుకున్నాడు. నగల దుకాణంలో పనికి కుదిరాడు. గత 10 నెలలుగా అక్కడే పనిచేస్తున్నాడు. ఆదివారం తీగల వంతెన చూసేందుకు వెళ్లాడు. దానిపైకి చేరుకొని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. షేక్‌ హబీబుల్‌ మృతితో స్వగ్రామం కేశబ్బతిలో తీవ్ర విషాదం నెలకొంది. అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కలలన్నీ చెదిరిపోయాయని హబీబుల్‌ తండ్రి మహీబుల్‌ షేక్‌ వాపోయాడు. హబీబుల్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కునాల్‌ ఘోష్‌ భరోసానిచ్చారు.   

675 టికెట్లు అమ్మారా?
మోర్బీ వంతెన ప్రమాదానికి ముమ్మాటికీ మానవ తప్పిదమే కారణమని స్పష్టమవుతోంది. ప్రమాద సమయంలో 500 మందికిపైగా జనం వంతెనపై ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. బరువు ఎక్కువై కూలిపోయిందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తీగల సాయంతో వేలాడే ఈ వంతెన సామర్థ్యం కేవలం 150 మంది. అంతకంటే ఎక్కువ మంది వెళితే ఆ బరువును తట్టుకోలేదు. ఈ విషయం తెలిసినప్పటికీ కాంట్రాక్ట్‌ సంస్థ ‘అజంతా ఒరెవా’ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏకంగా 675 మంది సందర్శకులకు టిక్కెట్లు విక్రయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.   

నా చెల్లెలు కనిపించడం లేదు  
ప్రమాదంలో చెల్లెలు కనిపించకుండా పోయిందని ఓ యువకుడు రోదిస్తున్నాడు. ‘‘ఆ వంతెనపైకి మొదటిసారి వెళ్లాం. అప్పటికే వందలాది మంది ఉన్నారు. సెల్ఫీలు తీసుకుంటుండగానే కుప్పకూలింది. నేను మాత్రం ఈదుకొచ్చా. చెల్లి కోసం నిన్నటి నుంచి వెతుకుతూనే ఉన్నా’’ అన్నాడు.

భారీ శబ్దం వినిపించింది  
‘‘స్నేహితులతో కలిసి వంతెన సమీపంలోనే కూర్చున్నా. అంతలో భారీ శబ్దం వినిపించింది. వంతెన కూలింది. వెంటనే అక్కడికి పరుగెత్తాం. కొందరు ఈదుతూ, మరికొందరు మునిగిపోతూ కనిపించారు. మేం పైపు సాయంతో 8 మందిని రక్షించాం’’ అని సుభాష్‌ భాయ్‌ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.

 నా మిత్రుడు రాజేశ్‌ ఏమయ్యాడు?   
తన మిత్రుడు రాజేశ్‌ గల్లంతయ్యాడంటూ జయేశ్‌ భాయ్‌ అనే యువకుడు కంటతడి పెట్టాడు. అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని వాపోయాడు.

15 మృతదేహాలను బయటకు చేర్చా
వంతెనపై 60 మందికి పైగా వేలాడుతూ కనిపించారని రమేశ్‌ భాయ్‌ చెప్పాడు. మిత్రులతో కలిసి తాడు సాయంతో 15 మృతదేహాలను బయటకు తెచ్చామన్నాడు.

మరిన్ని వార్తలు