కరోనాతో 500 మంది వైద్యులు మృతి

2 Oct, 2020 14:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు కనీసం 500 మంది వైద్యులు కరోనా వైరస్  (కోవిడ్ -19) సోకి మరణించారని శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) తెలిపింది.  వీరిలో సగం మందికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. "కోవిడ్ -19 రోగులకు చికిత్స అందిస్తున్న 515 మంది వైద్యులు ఇప్పటి వరకు అమరవీరులయ్యారు. వీరందరూ అల్లోపతి డాక్టర్లు, వీటిని వివిధ ఐఎంఏ శాఖల ద్వారా గుర్తించాం. దీని కోసం దేశవ్యాప్తంగా 1,746 శాఖలు పనిచేస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది’ అని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ అన్నారు.

ఐఎంఏ డేటాబేస్ ప్రకారం, డాక్టర్ రోగి నిష్పత్తి 1: 194 గా ఉంది. మరణించిన వారిలో  మెజారిటీ నంబర్‌(201)  వైద్యులు  60 నుంచి 70 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. తరువాత 50 నుంచి 60 సంవత్సరాల వయస్సులో 171 మంది మరణించారు. 70 ఏళ్లు పైబడిన వారు 66 మంది ఉండగా, 59 మంది వైద్యులు 35 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. 18 మంది వైద్యులు 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు ఉన్నారు. 

విధి నిర్వహణలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలపడానికి తమ వద్ద తగినంత డేటా లేదని కేంద్రం తెలిపింది. ప్రజారోగ్యం, ఆస్పత్రులు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, అందువల్ల కేంద్రం అటువంటి డేటా బేస్‌ను నిర్వహించలేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఇటీవల పార్లమెంటులో వెల్లడించిన సంగతి తెలిసిందే. కేవలం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీలో భాగంగా ఈ మహ​మ్మరి సమయంలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ప్రభుత్వ భీమా పథకం కింద పరిహారం చెల్లించే సంఖ్యను మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తుంది అని ఆయన తెలిపారు.

డేటాను నిశితంగా పరిశీలిస్తున్నామని  కేం‍ద్ర హెల్త్‌ సెక్రటరీ రాజేష్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సంరక్షణ కార్మికులకు 50 లక్షల బీమా ఉందని, దీన్ని మార్చి 2021 వరకు పొడిగించామని ఆయన తెలిపారు. అయితే కరోనా బారినపడి మృతి చెందిన వైద్యుల వివరాల విషయంలో కేంద్రం తన బాధ్యత లేదంటూ చేతులు ఎలా దులుపుకుంటుందని ఐఎంఏ డాక్టర్‌ శర్మ సూటిగా ప్రశ్నించారు. కోవిడ్‌ పరీక్ష నిర్వహించడానికి ఆధార్‌ను అడిగినప్పుడు ఆ డేటా కేం‍ద్రం దగ్గర ఎందుకు ఉండదని నిలదీశారు. చదవండి: కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు

మరిన్ని వార్తలు