ఆంగ్ల మాధ్యమంపైనే ఆసక్తి.. జేఈఈలో 99 శాతానికి పైగా వారే!

19 Jul, 2022 08:26 IST|Sakshi

జేఈఈ మెయిన్‌లో 99 శాతానికి పైగా ఇంగ్లిష్‌ మీడియాన్ని ఎంచుకున్న వారే

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యావకాశాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో ఆంగ్ల మాధ్యమం వైపే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. తమ ప్రాంతీయ భాషల్లో  పరీక్షలు రాసేందుకు ముందుకు రావడం లేదు. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే వారు అతి తక్కువ మంది కాగా.. వారిలోనూ మెరిట్‌ ర్యాంకుల్లో నిలిచేలా స్కోర్‌ సాధించిన వారు శూన్యం. ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.  

డిమాండ్ల నేపథ్యంలో.. 
ఉన్నత విద్యావకాశాలను ముఖ్యంగా ఇంజనీరింగ్‌ తదితర కోర్సులను ఆయా ప్రాంతీయ భాషల్లోనూ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ గతేడాది నుంచి జేఈఈ మెయిన్‌ను ఆంగ్లంతో పాటు 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహింపజేస్తోంది. హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్‌ రాసేందుకు విద్యార్థులకు అవకాశమిచ్చింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏర్పాటుకు ముందు జేఈఈ నిర్వహణ బాధ్యతలు చూసిన సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ).. 2014 వరకు ఆంగ్లం, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ మాధ్యమాల్లో జేఈఈని నిర్వహించేది. 2016 తర్వాత ఆంగ్లం, హిందీ, గుజరాతీల్లో జేఈఈని కొనసాగిస్తూ మరాఠీ, ఉర్దూలను తొలగించారు.

తమ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో జేఈఈ పరీక్షలకు విద్యార్థులు హాజరవుతున్నందున బెంగాలీ భాషా మాధ్యమంలో ఈ పరీక్షలను నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్‌ చేయడంతో.. ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో జేఈఈ మెయిన్‌ నిర్వహణకు బీజం పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుండటం, తమిళనాడు నుంచి కూడా అంతకు ముందు నుంచే ఆ భాషా మాధ్యమంలో పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఎన్టీఏ.. జేఈఈలో ఆంగ్లం, హిందీ, గుజరాతీలతో పాటుగా కొత్తగా మరో 10 ప్రాంతీయ భాషా మాధ్యమాలను ప్రవేశపెట్టింది.

ఇదీ చదవండి: Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

మరిన్ని వార్తలు