పాటిజిటివిటీ 17 శాతం.. టెస్టుల సంఖ్య పెంచాలి

30 Jul, 2020 16:27 IST|Sakshi

మొత్తం కేసుల్లో 91 శాతం జూలైలోనే

ప్రతి వార్డులో ఉచిత పరీక్షలు

ఆస్పత్రుల్లో చేరిన అందరికి పరీక్షలు

బెంగళూరు: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్ది కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో బెంగళూరులో మొత్తం నమోదైన కరోనా కేసుల్లో 91శాతం కేసులు కేవలం జూలైలోనే వెలుగు చూసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం సిటీలో మొత్తం కరోనా కేసులు 51,091 ఉండగా వీటిలో యాక్టీవ్‌ కేసుల సంఖ్య 36,224గా ఉంది. ఇది ఇలానే కొనసాగితే.. కొద్ది రోజుల్లోనే బెంగళూరు కరోనాకు హాట్‌స్పాట్‌గా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య అధికారులు తగినన్ని టెస్టులు చేస్తున్నారా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందకంటే గతవారం, ఈ వారం పాజిటివిటీ రేట్లలో చాలా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. జూలై 28 నాటికి సిటీలో పాజిటివిటీ రేటు 17.19 శాతంగా ఉంది. జూలై 22 నుంచి 28 వరకు బెంగళూరులో రోజుకు సగటున 8745 మందిని పరీక్షించగా.. యావరేజ్‌గా ప్రతి రోజు 1982 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. (కరోనా : భారత్‌లో మరో రికార్డు )

పరీక్షలు పెంచడంతో పెరుగుతున్న కేసులు
బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) వెల్లడించిన కోవిడ్‌-19 డాటా ప్రకారం.. జూలై 25-26 రోజుల్లో వరుసగా 9,697, 5,930 మందిని పరీక్షించారు. జూలై 27-28 నాడు 10,176, 9,773 మందిని పరీక్షించారు. ఈ క్రమంలో పాజిటివిటీ రేటు 20.19 శాతం నుంచి 32.8 శాతానికి పెరిగింది. ఆ తర్వాత రెండు రోజుల్లో పాజిటివిటీ రేటు 14.4శాతం నుంచి 19.4శాతానికి పడిపోయింది. దాంతో గత వారం రోజుల్లో బెంగళూరులో యావరేజ్‌ పాజిటివిటీ రేటు 22.66 శాతంగా నమోదయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత వారంలో నాలుగు రోజులలో నగరంలో పాజిటివిటీ రేటు 25శాతం కంటే ఎక్కువగా ఉంది. జూలై 26న మాత్రం అత్యధికంగా 32.8శాతం పాజిటివిటీ రేటు నమోదయ్యింది. జూలై 19 న పాజిటివిటీ రేటు 45 శాతంగా. ఆ రోజు 4703 నమూనాలను మాత్రమే పరీక్షిస్తే.. 2156 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జూలై 19 తర్వాత బెంగళూరులో పరీక్ష సంఖ్యలను పెంచడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. (ప్రజల వద్దకే పరీక్షలు)

పరీక్షలు చేయించుకోవడానికి భయం వద్దు
ఈ క్రమంలో కరోనాను కట్టడి చేయడం కోసం బీబీఎంపీ బెంగళూరులో పరీక్షలను పెంచాలని భావిస్తోంది. ఇందుకు గాను మంగళవారం నగరంలో ఉచిత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పౌరసంఘం ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరులోని ప్రతి వార్డులో బీబీఎంపీ ఉచిత పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిందని..  కమిషనర్‌ మంజునాథ్‌ ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రారంభదశలోనే వైరస్‌ను గుర్తిస్తే.. దాన్ని ఇతరులకు వ్యాప్తి  చెందకుండా ఆడ్డుకోవడంలో సాయం చేస్తుంది. ప్రజలు ప్రారంభ దశలోనే కరోనా పరీక్షలు చేయించుకుంటే.. త్వరగా కోలుకుంటారు. కనుక పరీక్షలు చేయించుకోవడానికి భయపడవద్దు’ అని కోరారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా బెంగళూరులో పరీక్ష సంఖ్యలను పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పరీక్షల సంఖ్య ప్రస్తుతం కంటే ఐదు రెట్లు పెంచాలని సూచిస్తున్నారు. (ఈ ముందు చూపు బాగుంది)

ఫోన్‌ నంబర్‌ నిర్ధారణ కోసం ఓటీపీ
సెయింట్ జాన్ మెడికల్ కాలేజీ మెడికల్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ సంజీవ్ లెవిన్ మాట్లాడుతూ.. ‘బెంగళూరులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కనుక ఎక్కువ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని కూడా పరీక్షించాల్సి ఉంటుంది. అయితే పాజిటివ్‌ వచ్చిందంటే సమాజంలో చిన్న చూపు, వివక్షత కారణంగా ప్రజలు పరీక్షలు చేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. దీని గురించి ప్రభుత్వమే అవగాహన కల్పించాలి’ అని కోరారు. బెంగళూరు ఆసుపత్రుల్లో చేరిన రోగులందరికి కరోనా పరీక్షలు చేయాలని సంజీవ్‌ సూచించారు. ‘ఆసుపత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ తప్పనిసరి పరీక్ష చేయమని సూచిస్తున్నాను. ఫలితంగా ఆరోగ్య సంరక్షణ కార్మికులను వైరస్ బారిన పడకుండా కాపాడటానికి సహాయపడుతుంది’ అని సంజీవ్ చెప్పారు. పరీక్షల కోసం వచ్చిన రోగులు తప్పుడు ఫోన్‌ నంబర్లు, చిరునామాలు ఇవ్వడంతో వారిని గుర్తించడానికి ఇబ్బంది తలెత్తుతుందన్నారు. అందుకని ఇక మీదట ఆస్పిత్రలో పేషెంట్‌ ఫోన్‌ నంబర్‌ ఇచ్చినప్పుడు దాన్ని నిర్ధరించడానికి ఓటీపీ పంపించనున్నట్లు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు