Mosquitoes: దోమలు మన దగ్గరకే రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే?

6 Feb, 2022 12:03 IST|Sakshi

సాయంత్రమైందంటే చాలు పరుగెత్తుకొస్తాయి దోమలు. చెవుల పక్కన చేరి వాటి భాషలో హలో చెబుతుంటాయి. కుట్టి కుట్టి రక్తాన్ని పీల్చేస్తుంటాయి. అంతటితో అయి పోతుందా.. లేనిపోని రోగాలను కూడా అంటి స్తాయి. అందుకే దోమ తెరలు, ఆల్‌ అవుట్‌లు, రకరకాల ప్రయోగాలతో దోమల్ని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాం. ఇవన్నీ సరే.. మనం ఎక్కడున్నా సరే అసలు దోమలు మన దగ్గరకే రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చాలా మంది అనుకునే ఉంటారు. తాజాగా శాస్త్రవేత్తలు కూడా ఇదే ఆలోచనపై పరిశోధన చేశారు. 4 రకాల రంగుల బట్టలు వేసుకుంటే దోమలు మనల్ని కాస్త తక్కువగా కుడతాయని, ఇంకో 4 రకాల రంగుల బట్టలేసుకుంటే మాత్రం ‘అంతే’ సంగతులని కనుగొన్నారు. ఆ రంగుల కథేంటో, దోమలు రంగులను ఎలా గుర్తిస్తు న్నాయో తెలుసుకుందాం.  

వాసన, రంగుతో పసిగట్టేసి..
మనుషులు విడుదల చేసే కార్బన్‌ డై ఆక్సైడ్, చెమట వాసన, శరీర ఉష్ణోగ్రతను గుర్తించాక నేరుగా మనుషుల దగ్గరకు దోమలు వస్తున్నాయని ఇదివరకే కనుగొన్నారు. తాజా పరిశోధనలో నాలుగో అంశాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే ‘రంగు’. చెమట, కార్బన్‌ డై ఆక్సైడ్‌ వాసన గుర్తించనంత వరకు మనుషులున్నా, ఇంకేమున్నా దోమలు పట్టించుకోలేదని.. కానీ వాటి వాసనను పసిగట్టాక మాత్రం ఆ వాసన వస్తున్న వైపు ఎగురుతున్నాయని గుర్తించారు. అయితే ఇందులోనూ ఇంకో ఆసక్తికరమైన అంశాన్ని కనుగొన్నారు. వాసన వచ్చే ప్రాంతంలో ఎరుపు, నారింజ, నలుపు, సియాన్‌ రంగులవైపు దోమలు ఎక్కువగా వెళ్లాయని.. ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు రంగులను పట్టించుకోలేదని గమనించారు.

మనుషుల శరీరం దోమలకు ఎరుపు–నారింజ రంగు రూపంలో కనిపిస్తుందని, అందుకే నేరుగా మన దగ్గరకు వచ్చేస్తాయని తెలుసుకున్నారు. మన శరీర ఛాయతో వాటికి సంబంధం లేదని, అన్ని శరీరాలూ వాటికి ఎరుపు–నారింజ రంగులోనే కనిపిస్తాయని చెబుతున్నారు. కాబట్టి ఎరుపు, నారింజ, నలుపు, సియాన్‌ రంగుల బట్టలు వేసుకుంటే మన శరీర రంగుకు ఆ బట్టల రంగు తోడై దోమలు మరింత ఎక్కువగా మన దగ్గరకు వస్తాయని అంటున్నారు. ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు రంగుల బట్టలు వేసుకుంటే కాస్త తక్కువగా ఆకర్షితమవుతాయని వివరిస్తున్నారు.  

ప్రయోగం ఎలా చేశారు?
పరిశోధన కోసం ఒక్కో దోమను ఒక్కో టెస్ట్‌ చాంబర్‌లో పెట్టి మరీ శాస్త్రవేత్తలు పరీక్ష చేశారు. ఈ చాంబర్‌లలోకి రకరకాల వాసనలు పంపారు. అదే సమయంలో రకరకాల రంగులను ప్రదర్శించి చూశారు. ఎలాంటి వాసన లేనప్పుడు చాంబర్‌లో ఎలాంటి రంగును ప్రదర్శించినా దోమలు పట్టించుకోలేదు. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పంపాక ఆకుపచ్చ, నీలం, ఊదా రంగులను ప్రదర్శించినా పెద్దగా స్పందించలేదు. కానీ కార్బన్‌ డై ఆక్సైడ్‌తోపాటు ఎప్పుడైతే ఎరుపు, నారింజ, నలుపు, సియాన్‌ రంగులను ప్రదర్శించారో ఆ రంగుల వైపు వెళ్లడం గమనించారు. మామూలుగా మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు మంచి బిర్యానీ వాసన వస్తే ‘ఎక్కడినుంచబ్బా’ అని అటూ ఇటూ చూస్తాం. దోమలు కూడా కార్బన్‌ డై ఆక్సైడ్‌ వాసన రాగానే ‘వాటి బిర్యానీ’ ఎక్కడని చూస్తాయని శాస్త్రవేత్తలు సరదాగా చెప్పారు. శాస్త్రవేత్తలు తమ చేతికి రకరకాల గ్లోవ్స్‌ వేసుకొని కూడా పరిశీలించారని, అందులోనూ ఎరుపు, నారింజ, నలుపు, సియాన్‌ రంగు గ్లోవ్స్‌ వైపు దోమలు ఎక్కువగా వెళ్లాయని.. ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు రంగుల గ్లోవ్స్‌ను పట్టించుకోలేదని తెలిపారు. దోమలు వాటి ఆహారాన్ని ఎలా వెతుకుతాయో తెలుసుకోవడానికి ఇది తొలిమెట్టేనని, మనుషుల శరీరం నుంచి వచ్చే వాసనలను ఎలా అవి గుర్తిస్తున్నాయో తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు.  
– సాక్షి సెంట్రల్‌డెస్క్‌  

మరిన్ని వార్తలు