కాలేజ్‌ డేస్‌లో లవ్‌ ఆ తర్వాత పెళ్లి.. ఇంతలోనే ఇలా ఎందుకు?

9 Aug, 2022 05:32 IST|Sakshi

డెంటిస్టు, కుమార్తె అనుమానాస్పద మృతి 

బెంగళూరు బనశంకరిలో సంఘటన 

బనశంకరి: బెంగళూరులో సుష్మా అనే దంతవైద్యురాలు తన కూతురికి మానసిక వైకల్యమని పాపను నాలుగో అంతస్తు నుంచి విసిరివేసి, తాను దూకేందుకు యత్నించడం తెలిసిందే. ఈ ఘటనలో పాప మరణించింది. అంతలోనే మరో దంతవైద్యురాలు, ఆమె కూతురు విగతజీవులుగా కనిపించారు. బనశంకరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. బనశంకరి పోలీసులు చేరుకుని పరిశీలించారు.

దంత వైద్యురాలు శైమా (39), కుమార్తె ఆరాధన (10) ఇంట్లో చనిపోయి ఉన్నారు. వివరాలు.. వీరు కావేరినగరలో నివాసం ఉంటున్నారు. ఆరాధన నాలుగో తరగతి చదువుతోంది. రెండురోజుల క్రితమే ప్రాణాలు పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. తల్లీకూతురు ఉరికి వేలాడుతున్నట్లు గుర్తించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.  

ఆమెది కొడగు, ఆయనది కోలారు  
కొడగు విరాజపేటేకు చెందిన శైమా పదేళ్ల క్రితం దంతవైద్య కోర్సు చదివేటప్పుడు కోలారు ప్రాంతానికి చెందిన నారాయణ్‌ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇరుకుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. భర్త సైతం డాక్టరు కాగా ఇంటి సమీపంలో క్లినిక్‌ నిర్వహిస్తున్నాడు. వారి మరణాలకు కచ్చితమైన కారణం తెలియరాలేదు. మృతురాలి సోదరుడు ఆ్రస్టేలియాలో ఉండగా సోమవారం నగరానికి చేరుకుని బనశంకరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వీరు మరణించి రెండురోజులైనా భర్త ఆ విషయాన్ని గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు